
యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే చర్యలు
కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఎరువుల దుకాణ యజమానులెవరైనా యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక రేటుకు అమ్మితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ హెచ్చరించారు. మంగళవారం కడప ఏఓ సురేష్‌కుమార్‌రెడ్డి, జేడీఏ కార్యాలయ వ్యవసాయ అధికారి గోవర్దన్‌లతో కలిసి కడపలోని మహేశ్వరి ఫర్టిలైజర్ ప్లాంట్‌తో పాటు పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టాక్ రిజిస్టర్, ఎరువుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణదారులందరు తప్పని సరిగా స్టాక్ రిజిస్టర్‌ను నిర్వహించాలన్నారు. అలాగే ఎరువుల ధరల బోర్డును షాపులో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతోపాటు ఎరువుల గ్రౌండ్ బ్యాలెన్స్‌కు, ఈ పాస్ మిషన్ బ్యాలెన్స్‌కు ఎలాంటి తేడా లేకుండా చేసుకోవాలని సూచించారు.
నేటి నుంచి కోర్టులలో
పోస్టుల భర్తీకి రాత పరీక్ష
కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా కోర్టులలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు రాత పరీక్షలు ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు కడప నగర శివార్లలోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల, కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, కేఎల్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, కేఓఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. అలాగే రాయచోటిలో శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాల, భాస్కర్ ఇంజినీరింగ్ కళాశాలలో, ప్రొద్దుటూరులో శ్రీ రాజేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలు ప్రతిరోజు మూడు షిఫ్ట్‌లలో ఉంటాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డును తీసుకొని రావాలన్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాలు ముందే హాజరు కావాలని, నిర్ణీత సమయం దాటిన తర్వాత లోనికి అనుమతించరని స్పష్టం చేశారు.
ఫుట్‌బాల్ విజేత
వైఎస్సార్ కడప జిల్లా జట్టు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏపీ సబ్ జూనియర్ బాలికల అంతర్ జిల్లా ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేతగా కడప జిల్లా జట్టు నిలిచింది. ఇటీవల అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో జరిగిన ఈ టోర్నమెంటులో జిల్లా బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో అనంతపురంపై 3–0 తేడాతో గెలిచారు. ఈ టోర్నమెంటులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు రాష్ట్ర జట్టుకు ఎంపికై ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నారాయణపూర్‌లో జరిగే సబ్ జూనియర్ బాలికల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా రాష్ట్ర జట్టుకు ఎంపికై న వారిలో బి.భార్గవి (గోల్ కీపర్), వై.అశ్విని, ఆర్‌బీ మైథిలి, సాద్విక, నవ్యశ్రీ, వర్షితారెడ్డి ఉన్నారు.

యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే చర్యలు