
దెబ్బతిన్న గ్యాస్ పైపులైన్లు
– శరవేగంగా పునరుద్ధరించిన సంస్థ
కడప కార్పొరేషన్ : కడప నగరంలో అనధికార తవ్వకాల వల్ల రెండు చోట్ల దెబ్బతిన్న గ్యాస్ పైపులైన్లను థింక్ గ్యాస్ సంస్థ శరవేగంగా మరమ్మతులు చేసి పునరుద్ధరించింది. మంగళవారం ఆ సంస్థ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. డ్రైనేజీ నిర్మాణ సమయంలో మారుతీనగర్‌లో నాగార్జున స్కూల్ సమీపంలో 20 మి.మీ తక్కువ పీడన పైపులైన్ దెబ్బతిందని, అలాగే వైఎస్సార్ కాలనీ గంగమ్మ ఆలయం సమీపంలో రోడ్డు తవ్వకం వల్ల 32 మి.మీ తక్కువ పీడన సహజ వాయువు పైపులైన్ దె దెబ్బతినిందన్నారు. ఈ రెండు ఘటనల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. వెంటనే రంగంలోకి దిగిన థింక్ గ్యాస్(గతంలో ఏజీఅండ్‌పీ ప్రథమ్) అత్యవసర ప్రతిస్పందన బృందం ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని మరమ్మతులు చేసి, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. తద్వారా ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అదే సమయంలో పైపులైన్ దెబ్బతినడానికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గ్యాస్ లీకేజీలు, ప్రమాదాలను నివారించడానికి ఏ విధమైన రోడ్డు తవ్వకం పనులకు ముందు అయినా ‘డయల్ బిఫోర్ యు డిగ్’ – 1800 2022 999 కు కాల్ చేయాల్సిందిగా కోరారు.