
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తీవ్ర జాప్యం
కడప కార్పొరేషన్ : చింతకొమ్మదిన్నె మండలం, మామిళ్లపల్లె పంచాయతీ, ఇందిరానగర్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ తీవ్ర ఆలస్యమవుతోందని ఇందిరానగర్‌కు చెందిన పల్లం చంద్రయ్య, ఆయన భార్య రామలక్ష్మ్ము ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వారు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఇందిరానగర్‌లో కిరాణాషాపు నడుపుతూ తాము జీవిస్తున్నామని, వివిధ వస్తువులు కొనేందుకు షాపు వద్దకు జనం వస్తుంటారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని అగ్రవర్ణాల వారు అక్కడి నుంచి తమ షాపు తీయించాలని కులం పేరుతో దూషించి, దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దీనిపై తాను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశానని, ఈ మేరకు సీకే దిన్నె పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఉన్నారన్నారు. మూడు నెలలు అవుతున్నా ఈ కేసుపై విచారణ జరక్కపోవడంతో అగ్రవర్ణాల వారు మరింత రెచ్చిపోతూ తమ కుటుంబాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, సాక్షులను కూడా బెదిరిస్తున్నారన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితుల వెంట మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.