
నిషేధిత జాబితాలో సమరయోధుడి భూమి
● రికార్డుల్లో సవరించినా ఎన్‌ఓసీ ఇవ్వని దేవదాయ శాఖ అధికారులు
● మామూళ్ల కోసం
ఏళ్ల తరబడి తిప్పుకుంటున్న వైనం
కడప సెవెన్‌రోడ్స్ : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వల్లే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని గౌరవించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది. కొంతమంది అధికారులు గౌరవించడం అటుంచి వారి కుటుంబ సభ్యులను వేధిస్తోంది. జిల్లాకు చెందిన ఓ సమరయోధునికి ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఎన్‌ఓసీ జారీ చేయకుండా మామూళ్ల కోసం ఆయన కుటుంబ సభ్యులను ఏళ్ల తరబడి తిప్పుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామానికి చెందిన ఆలూరు పక్కీరప్ప మహాత్మాగాంధీ పిలుపు మేరకు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1921లో మహాత్మాగాంధీ జిల్లాను సందర్శించిన సందర్భంలో పక్కీరప్ప కూడా శాంతియాత్రలో పాల్గొన్నారు. 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహం, 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అజ్ఞాతంతో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించారు. మోతుబరి కుటుంబానికి చెందిన తన నివాసంలో సాటి స్వాతంత్య్ర సమరయోధులకు ఆశ్రయం కల్పించడంతోపాటు ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వం 1951లో చాపాడు మండలం కుచ్చుపాప గ్రామం సర్వే నెంబరు 20/1లో 2.54 ఎకరాలు, 20/2లో 2.50 ఎకరాలు కలిపి మొత్తం 5 ఎకరాల 4 సెంట్ల వ్యవసాయ భూమిని పక్కీరప్పకు పట్టాగా ఇచ్చింది. 1999 నవంబరు 5వ తేదీ పక్కీరప్ప మరణించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆయన భార్య దస్తగిరమ్మ పేరిట బదలాయించిన రెవెన్యూ అధికారులు.. ఆ భూమి దేవదాయశాఖకు చెందినదిగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చారు. మైదుకూరు సబ్ రిజిస్ట్రార్ ద్వారా 2011లో ఈ విషయం తెలుసుకున్న పక్కీరప్ప కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అప్ప టి చాపాడు తహసీల్దార్‌ను సంప్రదించారు. పొరపాటున ఆ భూమిని నిషేధిత జాబితాలో ఉంచారని తహ సీల్దార్ తెలిపారు. సదరు సర్వే నెంబర్లలోని భూమిని దేవదాయశాఖ నుంచి తొలగిస్తూ జారీచేసిన ఉత్తర్వుల నకలు పక్కీరప్ప కుటుంబ సభ్యులకు ఇచ్చారు. దీంతో నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వాలంటూ 2021 ఫిబ్రవరి 4వ తేదీ పక్కీరప్ప భార్య దస్తగిరమ్మ కడప దేవదాయ ధర్మదాయశాఖ సహాయ కమిషనర్‌ను కోరింది. ఈ విషయాన్ని పరిశీలించిన సహాయ కమిషనర్ సదరు సర్వే నెంబర్లలోని భూమికి ఎన్‌ఓసీ జారీ చేయాల్సిందిగా కోరుతూ విజయవాడలోని కమిషనర్‌కు నివేదిక పంపారు. ఇదిలాఉండగా 2021 ఫిబ్రవరి 25న పక్కీరప్ప భార్య దస్తగిరమ్మ మరణించారు. పక్కీరప్ప కుమారులు ఆలూరి శరత్‌బాబు, అజయ్‌బాబు ఈ విషయంపై మైదుకూరు సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించగా, తమకు ఇంతవరకు ఎన్‌ఓసీ రాలేదని బదులిచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికి రావడంతో 2025 జులై 4వ తేదీ దేవదాయశాఖ సహా య కమిషనర్‌ను సంప్రదించి ఎన్‌ఓసీ జారీ చేయాలంటూ శరత్‌బాబు, అజయ్‌బాబు కోరారు. సహాయ కమిషనర్ ఈ భూమిపై మళ్లీ నివేదిక పంపాలంటూ ఈఓ టెంపుల్స్–2 ప్రొద్దుటూరు ఇన్‌స్పెక్టర్‌ను కోరా రు. కేవలం మామూళ్లు కోసం ఉద్దేశపూర్వకంగానే దేవదాయశాఖ అధికారులు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సమస్యను యేటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రుల దృష్టికి తీసుకు వెళుతున్నా పరిష్కారం లభించలేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్‌ఓసీ జారీ చేయడం ద్వారా సమరయోధుని కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.