
దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం
● బాలాలయ నిర్మాణానికి శ్రీకారం
● అంకురార్పణ పూజల నిర్వహణ
కడప సెవెన్‌రోడ్స్ : దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనుల ప్రక్రియ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. బాలాలయ సంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, బాలబింబాలకు జలాధివాసం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆల య ఇన్‌స్పెక్టర్ పి.ఈశ్వర్‌రెడ్డి పర్యవేక్షించారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించి బుధవారం బాలాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తారు. తిరుమల–తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారు, అండాళమ్మ వారి గర్భాలయాన్ని, విమాన గోపురాన్ని, రాజ గోపురాలకు మరమ్మతులు చేపడుతున్నారు. దీంతో స్వామి, అమ్మవార్ల మూల విరాట్‌కు బదులుగా గర్భాలయం ఎదురుగా మండపంలో బాలాలయం నిర్మాణం చేపట్టారు. జీర్ణోద్ధరణ పనులు పూర్తయ్యే వరకు భక్తులు బాలాలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంటుంది. స్వామి, అమ్మవార్లకు నిర్వహించే నిత్య, నైమిత్తిక, కామ్య కై ంకర్యాలు యథావిధిగా బాలాలయంలో నిర్వహిస్తారు.
● రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దేవుని కడప ఆలయం ఒకటి. తిరుమల తొలిగడపగా పేరు న్న ఈ ఆలయంలోని స్వామిని జనమే జయ మహా రాజు ప్రతిష్ఠించారని చెబుతారు. కై ఫీయత్తుల ప్రకారం తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయ రాజగోపురం, దేవుని కడప ఆలయ రాజగోపురం ఒకేసారి నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఆలయంలోని రాజగోపురంతోపాటు ముఖ మండపం, గర్భాలయం, అంతరాళం, ప్రాకారం, మట్లి అనంత భూపాలుడు నిర్మించినట్లు తెలుస్తోంది. వైదుంబులు, ఓరిగంటి రాజులు, వల్లూరు పాలకులు, సంబెటరాజులు, సాళు వ, సంగమ, తులువ వంశీకులు ఈ క్షేత్రం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు పలుమార్లు కడప రాయుడిని దర్శించినట్లు చరిత్ర చెబుతోంది. పురా తన ఆలయం కావడంతో టీటీడీ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది.