
పాఠశాల విలీనాన్ని ఆపాలి
కడప సెవెన్‌రోడ్స్ : చాపాడు మండలం చియ్యపాడు గ్రామ ఎస్సీ కాలనీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పాఠశాలను మోడల్ స్కూలు పేరుతో వేరే చోటికి తరలించడం తగదని, తక్షణమే దీనిని ఆపాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న మోడల్ స్కూలులో తమ పాఠశాలను విలీనం చేస్తే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్ స్కూలుకు వెళ్లే దారిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కనుక తమ పాఠశాలను తమ కాలనీలోనే ఉంచాలన్నారు. ఇందుకు కారణమైన ఎంఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బీఎస్ కర్ణమాదిగ, తప్పెట హరిబాబు, పీఆర్‌ఎస్‌వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మునెయ్య తదితరులు పాల్గొన్నారు.