
కేసీ పరిధిలో సాగని పనులు
కడప అగ్రికల్చర్ : కేసీ కాలువ పరిధిలో చాలా మంది రైతులు వరి పంటనే ఎక్కువగా సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా కేసీ కాలువ పరిధిలో 92 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉంది. కానీ కేసీ కాలువకు నీరు వచ్చినా వరిసాగు పనులు అంతగా ఊపు అందుకోలేదు. ఇప్పుడిప్పుడే కేసీ కాలువ కింద రైతులు నారుమడులు సాగు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. బోరుబావుల కింద ముందుగా నారుమడులు సాగు చేసుకున్న రైతులు మాత్రం వరినాట్లు చేపట్టగా మిగతా రైతులు ఎవరు కూడా వరినాట్లను అంతగా చేపట్టలేదు. నదీ పరివాహక, ప్రాజెక్టుల పరిధిలో కూడా వరి నాట్ల సాగు అంతగా ముమ్మరం కాలేదు. జిల్లా వ్యాప్తంగా వరి సాధారణ సాగు 30804 హెక్టార్లకు ఇప్పటి వరకు 6568.08 హెక్టార్లలో మాత్రమే వరిపంటను సాగు చేశారు. అంటే 21.32 శాతం మేర వరిసాగు అయింది.. దీంతోపాటు ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా వరిసాగు అంతగా ఊపందుకోలేదు. ఏదిఏమైనా ఈ నెలాఖరుతోపాటు సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో వరిసాగు పనులు ఊపందుకోనున్నాయి.
జిల్లాలోని ప్రాజెక్టు పరిధిలో నత్తనడకన..
జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలో కూడా వరిసాగు నత్తనడకన సాగుతోంది. ఇందులో భాగంగా కొండాపురం మండలంలో సాధారణసాగు 413 హెక్టార్లకుగాను ఇప్పటి వరకు కేవలం 25 హెక్టార్లలో వరి సాగైంది. అలాగే బి.మఠంలో 1610 హెక్టార్లకు 720 హెక్టార్లలో, కలసపాడులో 1005 హెక్టార్లకు 111 హెక్టార్లలో, పోరుమామిళ్లలో 1152 హెక్టార్లకు 251 హెక్టార్లలో, బి.కోడూరులో 1056 హెక్టార్లకు 70 హెక్టార్లలో, మైలవరంలో 250 హెక్టార్లకు కేవలం ఒక హెక్టారులో మాత్రమే వరిపంట సాగైంది.
నదీ పరివాహక ప్రాంతాల్లో అంతంతగానే ..
జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా వరినాట్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజుపాలెంలో సాధారణసాగు 759 హెక్టార్లకు కేవలం 30 హెక్టార్లలో వరిపంట సాగైంది. అలాగే ప్రొద్దుటూరులో 1481 హెక్టార్లకు 70 హెక్టార్లు, జమ్మలమడుగులో 1093 హెక్టార్లకు 520 హెక్టార్లలో, కమలాపురంలో 373 హెక్టార్లకు 272.5 హెక్టార్లలో, వల్లూరులో 1047 హెక్టార్లకు 450 హెక్టార్లలో, చెన్నూరులో 1180 హెక్టార్లకు 529 హెక్టార్లలో, వేంపల్లిలో 450 హెక్టార్లకు 332.84 హెక్టార్లలో, చక్రాయపేటలో 1071 హెక్టార్లకు 321హెక్టార్లలో, సిద్దవటంలో 930 హెక్టార్లకు 905 హెక్టార్లలో, ఒంటిమిట్టలో 261 హెక్టార్లకు 147 హెక్టార్లలో వరిపంట సాగైంది.
కేసీ కాలువ కింద అరకొరగానే..
జిల్లాలోని కేసీ కాలువ పరిధిలోని మండలాల్లో కూడా వరినాట్ల సాగు అరకొరగానే సాగుతోంది. దువ్వూరు మండలంలో సాధారణ సాగు 2585 హె క్టార్లు ఉంటే ఇప్పటికి కేవలం 30 హెక్టార్లలో కూడా వరిపంటను సాగు చేయలేదు. అలాగే మైదుకూరు మండలంలో కూడా 1192 హెక్టార్లకు గాను 8 హెక్టార్లలో వరిపంట సాగైంది. అలాగే ఖాజీపేట మండలంలో 3220 హెక్టార్లకు 20 హెక్టార్లలో, రాజుపాలెంలో 759 హెక్టార్లకుగాను 30 హెక్టార్లలో వరిపంట సాగైంది. అయితే ఇటీవలే చాలా మంది రైతులు నా రుమడులను సాగు చేశారు. ఆగస్టు చివరిలో అలాగే సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో కేసీ కాలువ పరిధిలో వరినాట్ల సాగు ముమ్మరం కానుంది.
కేసీ కింద ఇప్పుడిప్పుడే నారు మడుల సాగులో రైతన్నలు
ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో సాగు అంతంతమాత్రమే
30,804 హెక్టార్ల సాధారణ సాగుకు 6568.27 హెక్టార్లలో వరిసాగు
21.32 శాతం మేర సాగైన వరి పంట
నారుమడులు, వరిసాగు పనుల్లో రైతులు
నారుమడి సాగు చేశాను..
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం డ్యాం నిండింది. దీంతో కేసీ కాలువకు రెండు వారాల క్రితమే నీటిని వదిలారు. దీంతో కేసీ కింద రైతులంతా నారుమడులను సాగు చేసే పనిలో బిజీగా ఉన్నారు. నేను కూడా వారం క్రితం నాడు మడిని చల్లాను. మరో రెండు, మూడు వారాల్లో వరిసాగును ప్రారంభిస్తా.
– చిరంజీవిరెడ్డి, రైతు, బి. కొత్తపల్లి, ఖాజీపేట మండలం
లక్ష్యానికి మించి సాగయ్యే అవకాశం..
ఏడాది వరిపంట లక్ష్యానికి మంచి సాగయ్యే అవకాశం ఉంది. ఇటీవల వర్షాభావ పరిఽస్థితుల్లో వరిసాగు తగ్గుతుందేమో అనుకున్నాం. కానీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం డ్యాం నిండింది. దీంతో కేసీ కాలువకు ఇటీవలే నీరు విడుదల చేశారు. ఇక కేసీ పరిధిలోని రైతులందరూ ముమ్మరంగా వరిమడులను సాగు చేసుకుంటున్నారు. మరో పదిహేను రోజుల్లో వరినాట్ల సాగు ముమ్మరం కానుంది. ఈ ఏడాది లక్ష్యానికి మించి సాగయ్యే అవకాశం ఉంది.
– చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి

కేసీ పరిధిలో సాగని పనులు

కేసీ పరిధిలో సాగని పనులు

కేసీ పరిధిలో సాగని పనులు