హామీల అమలులో ‘సూపర్‌ ఫెయిల్యూర్‌’ | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ‘సూపర్‌ ఫెయిల్యూర్‌’

Aug 19 2025 4:58 AM | Updated on Aug 19 2025 4:58 AM

హామీల అమలులో ‘సూపర్‌ ఫెయిల్యూర్‌’

హామీల అమలులో ‘సూపర్‌ ఫెయిల్యూర్‌’

కడప కార్పొరేషన్‌ : సూపర్‌ సిక్స్‌ హామీలు సూపర్‌ సక్సెస్‌గా అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ‘సూపర్‌ ఫెయిల్యూర్‌’ అని ఎద్దేవా చేశారు. కొన్ని పత్రికలు, టీవీల్లో సూపర్‌ సిక్స్‌ హామీలను సూపర్‌ సక్సెస్‌గా అమలు చేశానని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదని అనుకున్న చందంగా అరకొర హామీలు అమలు చేస్తూ అన్నీ చేశామని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈవీఎంల మోసంతోనే ఈ ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు వచ్చాయని, అయినా వైఎస్సార్‌సీపీకి 42 శాతం ఓట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ప్రజల తరుపున పోరాడే నిజమైన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఒక్కటేనని, తమ పోరాటం వల్లే అరకొర పథకాలైనా అమలు చేశారన్నారు. పింఛన్‌ మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచి 5లక్షల పింఛన్లు కోత కోశారని, మరో పది లక్షలు కోత విధించేందుకు సర్వే చేశారని, అర్హులు ఎవరైనా ఉంటే మళ్లీ అప్పీలు చేసుకోవాలని నంగనాచి మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 60–70 శాతం వైకల్యం ఉన్నవారికి కూడా పింఛన్లు తీసేస్తున్నారని, ఆ పాపం ఊరికే పోదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకూ ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 82లక్షల మంది విద్యార్థులు ఉంటే 52లక్షల మందికే తల్లికి వందనం అమలు చేశారని, మధ్యాహ్న భోజనం పథకం, విద్యాకానుక, వసతి దీవెన పథకాలను ఎత్తేసి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి రైతులు దారుణంగా మోసపోయారని, కేంద్ర సాయంతో సంబంధం లేకుండా రూ.20వేలు ఇస్తామని చెప్పి...రూ.7వేలు ఇచ్చి సరిపుచ్చారన్నారు. యూరియా, ఎరువులు, విత్తనాలు లేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని, పంట నష్టం సంభవిస్తే నష్ట పరిహారం ఊసే లేదన్నారు. ఎన్నికల ముందు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడికై నా పోవచ్చని ఊదరగొట్టారని, ఇప్పుడు హైర్‌ బస్సులు, ఏసీ బస్సులు, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ వంటి ఏ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం లేదని షరతులు పెట్టారన్నారు. ఘాట్‌ ఉన్నా, స్పెషల్‌ సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం లేదన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంతవరకూ ఇవ్వలేదని, దాన్ని పీ4 పథకంలో అంతర్భాగం చేశామని చెబుతున్నారన్నారు. 20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, దాన్ని స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించారన్నారు. కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పి, ఇప్పటికి మూడు సార్లు పెంచారని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌ కుమార్‌, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు యానాదయ్య, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌. వెంకటేశ్వర్లు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌. శివరామ్‌, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షేక్‌ షఫీ, పార్టీ జిల్లా కార్యదర్శి మునిశేశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement