
విద్యుదాఘాతంతో యువ కౌలు రైతు మృతి
మైదుకూరు : సొంత పొలానికి తోడు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్న ఆ యువ రైతు కలలను విద్యుత్ రూపంలో వచ్చిన మృత్యువు కల్లలు చేసింది. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకున్న అతన్ని చిన్న వయసులోనే మృత్యువు కబళించింది. మైదుకూరులో సోమవారం పొలం వద్ద మోటారు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రాటాల పవన్‌కుమార్ (38) అనే యువ కౌలు రైతు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లెకు చెందిన రాటాల లక్ష్మీనారాయణకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో కుమారుడు పవన్‌కుమార్‌కు 11 ఏళ్ల కిందట మైదుకూరుకు చెందిన లక్ష్మీదేవితో వివాహమైంది. బాచేపల్లెలో సొంత పొలం ఒక ఎకరాకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పవన్‌కుమార్ పంటలు సాగు చేస్తున్నాడు. మూడేళ్ల కిందట మైదుకూరుకు నివాసాన్ని మార్చి ఇక్కడ కొందరి రైతుల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. స్థానిక ఎర్రచెరువు ప్రాంతంలో కౌలుకు తీసుకున్న పది ఎకరాల పొలంలో వరి నాటాల్సి ఉంది. సోమవారం పొలాన్ని వరి నాటేందుకు సిద్ధం చేయడానికి బాడుగ ట్రాక్టర్‌ను పిలుచుకొని వెళ్లాడు. పొలానికి తగినంత నీరు పెట్టేందుకు ఉదయం 11 గంటల ప్రాంతంలో మోటారు ఆన్ చేశాడు. విద్యుత్ ఘాతానికి గురై విలవిల్లాడుతూ పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో భర్తకు భోజనం తీసుకుని పొలం వద్దకు వెళ్లిన భార్య లక్ష్మీదేవి ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయింది. భర్త మృతదేహం వద్ద కన్నీరు మున్నీరైంది. మృతి చెందిన కౌలు రైతు పవన్‌కుమార్‌కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ పోలీసులు పరిశీలించి పవన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బంధువులు కోరారు.