సిబ్బంది ముగ్గురు.. ఖైదీలు ఐదుగురు | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది ముగ్గురు.. ఖైదీలు ఐదుగురు

Aug 18 2025 6:31 AM | Updated on Aug 18 2025 6:31 AM

సిబ్బంది ముగ్గురు.. ఖైదీలు ఐదుగురు

సిబ్బంది ముగ్గురు.. ఖైదీలు ఐదుగురు

సబ్‌జైలులో స్పష్టంగా కనిపిస్తున్న

భద్రతాలోపం

ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు ?

ప్రొద్దుటూరు క్రైం : సిబ్బంది ముగ్గురు.. ఖైదీలు ఆరుగురు. ఇది సినిమా టైటిల్‌ కాదు. ప్రొద్దుటూరు సబ్‌జైల్‌లో ఉన్న ఖైదీలు, విధుల్లో ఉన్న సిబ్బంది సంఖ్య. సబ్‌జైల్లో వివిధ కేసులకు సంబంధించి ఐదుగురు రిమాండు ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. ముగ్గురు సిబ్బంది విధుల్లో ఉన్నా ఐదుగురిలో ఒక ఖైదీ గోడ దూకి పారిపోయాడు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. సబ్‌జైల్లో ఉన్న రిమాండు ఖైదీ మహ్మద్‌రఫీ శనివారం ఉదయం జైలు గోడ దూకి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో జైల్లో భద్రతా లోపాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా తక్కువ మంది ఖైదీలు ఉన్నప్పుడు వారిపై నిఘా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 20 అడుగులు మేర ఉన్న గోడ దూకి దొంగ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ముఖ్యంగా గోడ చుట్టూ విద్యుత్‌ తీగలు కూడా ఉన్నాయి. వీటి గుండా దొంగ తప్పించుకొని వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్‌ తీగలను తగలకుండా అతను తప్పించుకొని వెళ్లే విధానాన్ని చూసి పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఖైదీ గత నేరచరిత్రను ఉన్నతాధికారులకు చెప్పని సిబ్బంది ..

నిందితులను అరెస్ట్‌ చేసిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వారిని స్థానికంగా ఉన్న సబ్‌జైలుకు తరలిస్తారు. జైలుకు తరలించిన తర్వాత అతను పాత నేరస్తుడైతే పోలీసులు ఈ విషయాన్ని జైలు అధికారులకు తెలియజేస్తారు. లేదా రిమాండు రిపోర్టు ఆధారంగా వారి నేర చరిత్రను జైలు అధికారులు తెలుసుకుంటారు. వారిపై ఉన్న కేసుల ఆధారంగా కోర్టు సూచనతో సబ్‌జైల్లో ఉంచాలా లేక జిల్లా కేంద్రానికి తరలించాలా అనేది ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామంలో పట్టపగలే చోరీ చేస్తూ పట్టుబడిన మహమ్మద్‌రఫీని ఈ నెల 13న రాజుపాలెం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండు నిమిత్తం ప్రొద్దుటూరు సబ్‌జైలుకు తరలించారు. ఇతను అనేక జిల్లాల్లో చోరీలు చేశాడు. నిందితుడిపై 25కు పైగా కేసులు ఉన్నాయి. టంగుటూరు గ్రామంలో చోరీ చేస్తున్న సమయంలో అడ్డు వచ్చిన ఇంటి యజమానిపై మహమ్మద్‌రఫీ దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కరుడుగట్టిన నేరస్తుడైన అతని గత నేర చరిత్ర గురించి పోలీసులు సబ్‌జైలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మహమ్మద్‌రఫీపై ఉన్న పాత కేసుల గురించి ఇక్కడి సిబ్బంది జిల్లా జైళ్లశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని విశ్వసనీయ సమాచారం. కాగా ప్రొద్దుటురు సబ్‌జైలు నుంచి పారిపోయిన రిమాండు ఖైదీ మహమ్మద్‌రఫీ కోసం త్రీ టౌన్‌ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా అతని జాడ కోసం అన్వేషిస్తున్నారు.

నేడో రేపో సస్పెన్షన్‌ ఉత్తర్వులు?

రిమాండు ఖైదీ తప్పించుకున్న ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. రిమాండులో ఐదుగురు మాత్రమే ఖైదీలు ఉన్నా సరైన పర్యవేక్షణ చేయలేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఖైదీ పారిపోయిన ఘటనపై జిల్లా సబ్‌జైళ్ల అధికారి అమర్‌బాషా విచారణ చేసి పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌తో పాటు మరో ఇద్దరిపై వేటు పడే అవకాశం ఉంది. శాఖాపరమైన చర్యలకు సంబంధించిన ఆదేశాలు నేడో, రేపో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా 2021లో జమ్మలమడుగు సబ్‌జైలు నుంచి మహమ్మద్‌రఫీ తప్పించుకొని పోలేదని, అతనికి బెయిల్‌ రావడంతో జైలు నుంచి విడుదల చేసినట్లు జిల్లా సబ్‌ జైళ్ల అధికారి అమర్‌బాషా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement