కలసపాడు : ఓసీలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారుపల్లె జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని రెడ్డిపల్లెలో ఆయన మాట్లాడుతూ ఓసీ జాబితాలో ఉన్న రెడ్లు, బ్రాహ్మణులు, కమ్మ, బలిజ, ఆర్యవైశ్య తదితర ఎన్నో కులాల్లో నిరుపేదలైన వారు ఉన్నారన్నారు. వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని సూచించిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన ఓసీలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను మంజూరు చేసి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రెడ్డి సంఘం నాయకులు అమ్మిరెడ్డి వెంకటనాగిరెడ్డి, ఎర్రగుంట్ల నాగమోహన్‌రెడ్డి, తుమ్మల కొండారెడ్డి, గువ్వల వెంకట సుబ్బారెడ్డి, పోలక సుబ్బారెడ్డి, రామమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.