
బ్రౌన్ గ్రంథాలయానికి బీరువా, పుస్తకాల బహూకరణ
కడప ఎడ్యుకేషన్ : తప్పెట్ల కొత్తపల్లికి చెందిన దివంగత మల్లిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం బీరువాను, ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలోని వంద పుస్తకాలను ఆయన కుమారుడు, పెన్నా సిమెంట్స్ విశ్రాంత జనరల్ మేనేజర్ మల్లిరెడ్డి సుబ్బారెడ్డి ఆదివారం సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి బహూకరించారు. సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ్ణశాస్త్రి, గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణ రావు, ఎన్.రమేశ్‌రావు, జూనియర్ అసిస్టెంట్ ఆర్.వెంకటరమణ వాటిని స్వీకరించారు. పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచా ర్య జి.పార్వతి మాట్లాడుతూ వారు బహూకరించిన విలువైన గ్రంథాల్లో విష్ణు పురాణం, వామన పురాణం, శ్రీమద్భాగవతం (వ్యాసుడు), ఆంధ్ర మహాభారతం, పోతన భాగవతం, శివరాత్రి మాహాత్మ్యం, శ్రీమద్భగవద్గీత, ఆంధ్రవాల్మీకి రామాయణం, కాళికాంబా సప్తశతి తదితర పుస్తకాలు ఉన్నాయన్నారు.
అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ
మదనపల్లె రూరల్ : పశ్చిమబెంగాల్‌వాసి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం పశ్చిమబెంగాల్‌వాసి ఖదీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉపాధికోసం పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్ ఇమామ్‌నగర్‌కు చెందిన ఎస్.కే.మైముల్ కుమారుడు ఎస్.కే.ఖదీర్(30) మదనపల్లెకు వచ్చి రోడ్డు, భవననిర్మాణ పనులు చేస్తూ కురబలకోట మండలం రైల్వేబ్రిడ్జి సమీపంలో షెడ్ నిర్మించుకుని మరో ఇద్దరితో కలిసి ఉంటున్నాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈనెల 15 శుక్రవారం తనకు పరిచయస్తుడైన ఆటోడ్రైవర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లాడు. శనివారం మదనపల్లె మండలం సీటీఎం రైల్వే అండర్‌బ్రిడ్జి సమీపంలో శవమై కనిపించాడు. ఆటోడ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసు విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు.
ఇంటిలో చోరీ
గాలివీడు : మండల కేంద్రమైన గాలివీడులోని గౌతమ్ స్కూలు సమీపంలో శనివారం రాత్రి ఓ ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు బీగాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఎం.మల్లయ్య శనివారం తన అత్తగారింటికి వెళ్లడంతో గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో ఉన్న రూ. 3 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను అపహరించినట్లు బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. దొంగతనం చేసిన నగదు, బంగారు ఆభరణాల రశీదుల వివరాలను స్టేషన్‌లో సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండల ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టరాదని, బ్యాంకు లాకర్‌లో భద్ర పరుచుకోవాలన్నారు. అలాగే ఊర్లకు వెళ్లే సమయంలో సమాచారం పోలీసు స్టేషన్‌లో తెలియజేస్తే ఆ ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రస్తుతం జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు.