
బద్వేలు నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి
బద్వేలు అర్బన్ : బద్వేలు నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని, లేనిపక్షంలో బ్రహ్మంగారిపేరుతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బద్వేలు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలోకి చేర్చుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎన్‌జీవో హోంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ న్యాయవాది దేవిరెడ్డి బ్రహ్మారెడ్డి, బీసీ సంఘం నాయకుడు బి.సి.రమణ మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో చేర్చడం వలన నియోజకవర్గ ప్రజలు అనేక రకాల వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తుందని అన్నారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిపోయి వేరొక జిల్లాలోకి మార్చడం తగదన్నారు. బద్వేలు నియోజకవర్గ ప్రజల మనోభావాలను గుర్తించి బద్వేలు నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని, అలా కుదరని పక్షంలో బద్వేలు నియోజకవర్గంతో పాటు గిద్దలూరు వరకు ఉన్న గ్రామాలు, ఆత్మకూరు సమీపంలోని ఉదయగిరి వరకు ఉన్న గ్రామాలతో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో బద్వేలు పట్టణాభివృద్ధి సొసైటీ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, పూలే అంబేడ్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు పిచ్చయ్య, సీనియర్ దళిత నాయకుడు ఓ.ఎస్.వి.ప్రసాద్, బలిజ సంఘం నాయకుడు కిరణ్, బీజేపీ నాయకుడు వెంకటసుబ్బయ్య, బీఎస్పీ నాయకుడు గౌస్‌పీర్, కవి ఇరుపోతు శ్రీనివాసవర్మ, సోమశిల వెనుకజలాల సాధన సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణయ్య, ఉపాధ్యాయ సంఘం నాయకులు సి.రామచంద్రారెడ్డి, ఆవులవెంకట్, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల అసోసియేషన్ నాయకులు నాగేశ్వర్‌రావు, చంద్రఓబుల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.