
వృద్ధుల పట్ల ఆదరణ చూపాలి
కడప సెవెన్‌రోడ్స్ : జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరణ చూపుతూ వారికి తమవంతుగా తోడ్పాటు అందించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం. బాలకష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.వెంకటరెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డిలు సూచించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే) 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని జడ్పీ కాంప్లెక్స్‌లో ఉన్న ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు పోరాటం చేసే యూనియన్‌గా కొనసాగుతున్న ఏపీయూడబ్ల్యుజే వద్ధుల సమక్షంలో వ్యవస్థాపక దినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులే మన జీవితానికి పునాది వేశారని, మన బాల్యంలో తల్లిదండ్రులు చూపిన ప్రేమను తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులను మనం ఆదరించడం ద్వారా చిన్నపిల్లలకు కూడా మానవత్వపు విలువలు తెలియజేసిన వారమవుతామన్నారు. ప్రేమాలయం నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ శ్రీనివాసులురెడ్డి, పాత్రికేయలు శివరాం, ఆంజనేయులు, శ్రీనివాసులు, పెన్నేరు శర్మ, మౌలా, నాగరాజు, సర్దార్, వీరనారాయణ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఏపీయూడబ్ల్యుజే నాయకులు