
విష జ్వరంతో విద్యార్థి మృతి
వేంపల్లె : వేంపల్లె పట్టణం శ్రీరాం నగర్ వీధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి బింగి రఘువరన్ ఆదివారం సాయంత్రం విష జ్వరంతో మృతి చెందాడు. కళాశాల రోడ్డులోని శ్రీరామ్‌నగర్‌లో నివాసముంటున్న బింగి ఓబులేసు, భారతిలకు ఇద్దరు పిల్లలు ఉండగా, రఘువరన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం విద్యార్థికి జ్వరం రావడంతో వేంపల్లెలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చూపించినట్లు తండ్రి ఓబులేసు తెలిపారు. రఘువరన్‌కు జ్వరం తగ్గకపోవడంతో కడప రిమ్స్‌కు తరలించి చికిత్స చేసి మెదడుకు జ్వరం సోకినట్లు వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్, రుయాకు తీసుకెళ్లారు. అయితే స్విమ్స్, రూయాలో బెడ్లు లేకపోవడంతో తిరిగి కడప రిమ్స్‌కు తీసుకొచ్చి రఘువరన్‌కు చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీరామ్‌నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విష జ్వరంతో విద్యార్థి మృతి