
సౌదీ అరేబియాలో కుమార్లకాల్వ వాసి మృతి
చక్రాయపేట : జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన చక్రాయపేట మండలం కుమార్లకాల్వకు చెందిన షేక్ నూర్‌బాషా(38) మృతి చెందాడు. ఆదివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12–30 గంటలకు మృతి చెందినట్లు అక్కడ ఉన్న అతని మిత్రులు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి నూర్‌బాషా బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇతను బతుకు దెరువు నిమిత్తం 15 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని దమామ్‌కు వెళ్లాడు. ఐదు నెలల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి భార్యా బిడ్డలు, బంధుమిత్రులతో హాయిగా గడిపి తిరిగి దమామ్ వెళ్లాడు. ఆదివారం విధులకు హాజరయ్యేందుకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్‌లోకి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. బాత్‌రూం నుంచి ఎంత సేపటికి రాకపోవడంతో మిత్రులు వెళ్లి చూడగా కిందపడి మృతిచెంది ఉన్నాడు. ఈ విషయాన్ని నూర్‌బాషా మిత్రులు కుమార్లకాల్వలోని కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తెలియగానే వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య గౌసియా, ఆర్షియా, రియాజ్, రిజ్వాన్ అనే 10 సంవత్సరాల లోపు పిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. మృతదేహాన్ని కుమార్ల కాల్వకు రప్పించేందుకు కృషి చేయాలని అధికార పార్టీ నేతలను కోరినట్లు మృతుడి బంధువు మిఠాయిగిరి కరీముల్లా తెలిపారు.