
● కలెక్టర్ గారూ.. మీరేం చెప్పదలుచుకున్నారు!
కడప సెవెన్‌రోడ్స్: పంద్రాగస్టు రోజు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధికారుల మధ్య తలెత్తిన వివాదం ఇంకా సమసిపోలేదు. ఇరువర్గాలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కలెక్టర్ ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాలని రెవెన్యూ అధికారులు పట్టుబడుతున్నారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన ప్రొటోకాల్ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులు తొలి నుంచి ప్రొటోకాల్ గాలికి వదిలేసి అధికార టీడీపీ నేతలతో సాగిల పడే ధోరణే ఇంతవరకు తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ప్రొటోకాల్ లేని టీడీపీ నేతలకు ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లా సమీక్షా కమిటీ లాంటి ముఖ్యమైన సమావేశాల్లో పెద్దపీట వేస్తూ వస్తున్నారు.
ఎమ్మెల్యే భర్తకు ప్రభుత్వ హోదానా!
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి ఎటువంటి ప్రభుత్వ హోదా లేదు. ఆయనేం ప్రజాప్రతినిధి కాదు. అయినా ‘ఎమ్మెల్యే భర్త’గా డీఆర్సీ సహా ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికపై దర్శనమిస్తుంటారు. అంతటితో ఆగకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రభుత్వ వేదికల నుంచి రాజకీయ విమర్శలు గుప్పించినా కలెక్టర్ సహా ఏ అధికారి అడ్డు చెప్ప లేదు. పలుమార్లు ఈ విషయాలు పత్రికల్లో ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. ఇప్పుడు తమవంతు వచ్చేసరికి ప్రొటోకాల్ గురించి మాట్లాడితే దాని విలువ ఏముంటుందనే ప్రశ్న లు ఉత్పన్నమవుతున్నాయి.
ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి ప్రస్తావన
జిల్లాకు చెందిన ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఓమారు ఎమ్మెల్సీ గా, నాలుగు పర్యాయాలు కడప లోక్‌సభ సభ్యునిగా ప్రజలకు విశేష సేవలు అందించిన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏదైనా ప్రజా సమస్యలపై కలెక్టర్ వద్దకు వచ్చినపుడు తొలుత చీటీ రాసి పంపించేవారట. ‘నేరుగా వెళ్లండి సార్...’ అంటూ అధికారులు చెప్పినా సున్నితంగా తిరస్కరించేవారు. కలెక్టర్ అనుమతి వచ్చాకే చాంబర్‌లోకి వెళ్లి సమస్యను విన్నవించేవారు. ఆయన హూందాతనం గురించి ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఉద్యోగులు, నగర పౌరులు చర్చించుకుంటున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తొలుత ప్రొటోకాల్ క్రమాన్ని తెలుసుకుని హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్, ఎస్పీ మాత్రమే వేదికపై కూర్చొవాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రొటోకాల్‌ను ఊటంకిస్తూ మాట్లాడుతున్నారు. అలాంటపుడు వేదికపై ప్రత్యేకంగా కుర్చీవేసి ఆశీనులు కావాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ఆహ్వానించడమంటే నిబంధనలు ఉల్లంఘించడం కాదా? ప్రొటోకాల్ లేదని స్పష్టంగా తెలిసినా డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌లే కాకుండా స్వయంగా కలెక్టరే వెళ్లి ఎమ్మెల్యేను వేదికపైకి ఆహ్వానించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పైగా ప్రొటోకాల్ విషయంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తతో, ప్రత్యేక శ్రద్దతో వ్యవహరించాలంటూ కలెక్టర్ శ్రీధర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు ఉద్భోదించడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి జాయింట్ కలెక్టర్‌పై, ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి డీఆర్వోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా దిక్కులేదంటే ఇక తమకేదైనా జరిగితే ఎవరు పట్టించుకుంటారని కిందిస్థాయి అధికారులు చర్చించుకుంటున్నారు. ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.
రెవెన్యూ తీరు వల్లే కడప ఎమ్మెల్యే కుర్చీ రగడ
ఏ హోదా లేకున్నాడీఆర్సీ సమావేశాల్లో టీడీపీ నేతలకు పెద్దపీట
అదే మర్యాద కోసం స్వాతంత్య్ర వేడుకల్లో అధికారులపై చిందులు
తొలుతే అడ్డుకట్ట వేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేతి కాదు