
ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం
చిన్నమండెం : ట్రాక్టర్ ఒరగడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మజ్‌హీసింగ్(23), గలగసింగ్(20), లక్ష్మణ్‌సింగ్‌లు చిన్నమండెం–పెద్దమండ్యం జాతీయ రహదారిలో హైవోల్టేజీ విద్యుత్ లైన్ పనులు చేస్తున్నారు. పనులు ముగించుకొని ట్రాక్టర్‌లో చిన్నమండెంకు వస్తుండగా పడమటికోన గ్రామం తొగటపల్లె సమీపంలో ట్రాక్టర్ పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో మజ్‌హీసింగ్(23), గలగసింగ్(20) అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్‌సింగ్‌కు గాయాలయ్యాయి. మృతదేహాలను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
సిద్దవటం : కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలం భాకరాపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన పడిఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని కడప రిమ్స్‌లో చేర్పించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఆమె వివరాలు తెలిసిన వారు ఒంటిమిట్ట సీఐ బాబు, 9121100581, సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ 9121100584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ప్రమాదంలో గాయపడి.. కోలుకోలేక..
ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాలు... స్థానిక మండల కేంద్రం ఇందిరా కాలనీకి చెందిన వెంకటరమణ, భార్య శాంతమ్మలు కలిసి గత గురువారం ద్విచక్రవాహనంలో పనుల మీద మదనపల్లెకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో వేపూరికోట వద్ద శాంతమ్మ చీర బైక్ చక్రానికి చుట్టుకొని కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గాలివీడు : మండలంలోని కొర్లకుంట పంచాయతీ పెద్దరెడ్డివారిపల్లెకు చెందిన నిర్జీ శంకరయ్య (38) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం మేరకు.. మృతుడు రజక వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిని పోషించడంలో అప్పులు ఎక్కువ చేశాడు. వాటిని తీర్చుకోలేక గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు ఆలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనారోగ్యంతో వివాహిత..
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని సూర్య నగర్‌లో నివాసముంటున్న విద్యుత్ శాఖ ఏఈ యోగానంద్ భార్య చిన్న రెడ్డెమ్మ (40) శనివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం

ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం

ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం