
రేపు విద్యాభవన్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
కడప ఎడ్యుకేషన్ : ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించి విద్యారంగ విచ్ఛిన్నానికి పూనుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 15న విజయవాడ విద్యా భవన్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ తెలిపారు. మంగళవారం కడప యూటీఎఫ్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఇప్పటి వరకు జీఓ 117 రద్దు చేయకుండా పాఠశాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని చెబుతున్నారన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చి వారి ద్వారా భర్తీ చేయాలన్నారు. బదిలీల వ్యవస్థలో తీసుకు వస్తున్న మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.