● దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి నీరు తాగాలి. మజ్జిగ తీసుకోవాలి. వీలైతే కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం కూడా తీసుకుంటే మంచిది.
● ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండటం మంచిది. తప్పనిసరైతే గొడుగు లేదా టోపీ, కళ్లద్దాలు ధరించాలి.
● తెలుపు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పేలా చూసుకోవాలి.
● వేడిచేసే మసాలాలు, నూనె వంటకాలకు దూరంగా ఉండాలి.
● పండ్లు, కూరగాయలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి.
● రాత్రి సమయంలో చలి నుంచి రక్షణకు దుప్పట్లు, స్వెట్టర్లు తప్పనిసరిగా వాడాలి
● చిన్నారులు, వృద్ధులు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
భువనగిరి: జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండగా.. చీకటి పడగానే కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో ప్రజలు పగలు ఎండ వేడిమిని, రాత్రి చలి తీవ్రతను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా ఉంటే, రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 18 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
కూలీల అవస్థలు
ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో కూలీలు, రైతులు, వీధి వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో పెరుగుతున్న చలికి వృద్ధులు, చిన్నారులు వణికిపోతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ ఆకస్మిక మార్పులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, విషజ్వరాలతో బాధపడుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్నందున ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, పెరుగుతున్న చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తుల (స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు తదితర) కొనుగోళ్లను ప్రారంభించారు.
భిన్న వాతావరణం
ఫ 32 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రతలు.. 15 డిగ్రీలకు పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
ఫ వాతావరణ మార్పులతో విజృంభిస్తున్న జలుబు, జ్వరాలు
ఫ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన


