సాక్షి, యాదాద్రి: అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును పలువురు మంగళవారం పరామర్శించారు. ఇటీవల ఆయనకు గుండెలో స్టంట్ వేశారు. హైదరాబాద్ బేగంపేటలోని ఆయన నివాసంలో కలిసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. త్వరగా కొలుకోవాలని ఆకాక్షించారు. మోత్కుపల్లిని కలిసిన వారిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం. హన్మంతరావు, మాజీ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి దంపతులు, ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ అంజనేయులు, కాంగ్రెస్ నాయకుడు ఎండీ సలీం, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
యూనిఫామ్ అందించడంలో జాప్యం వద్దు
సాక్షి, యాదాద్రి: విద్యార్థులకు యూనిఫామ్ అందించడంలో జాప్యం చేయవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్‌రావు అధికారులను కోరారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ వసతి గృహాల విద్యార్థులకు యూనిఫామ్, టై, బెల్ట్, షూ పంపిణీ తీరును సమీక్షించారు. ఎక్కడైనా ఇంకా అవసరం ఉంటే వెంటనే నివేదికను రూపొందించి అందజేయాలన్నారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, డీఐఓ బి. సురేష్‌రెడ్డి, వెంకటమ్మ, లింగారెడ్డి తదితరులు ఉన్నారు.
ఆరుతడి పంటల సాగే మేలు
భువనగిరిటౌన్ : ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం మేలని ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, డీఏఓ వెంకటరమణారెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ఎస్వీ గెస్ట్ హౌస్‌లో ఆత్మ కమిటీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా డైరెక్టర్లతో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావాన్ని రైతులందరూ సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అధిక నీటి అవసరమున్న పంటల జోలికి వెళ్లవద్దన్నారు. సాగునీటిని వృథా చేయకుండా బిందు, తుంపర సేద్యం వంటి ఆధునిక పద్ధతులతో పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. ఎల్‌నినో సవాళ్లు, ఆరుతడి పంటల యాజమాన్య పద్ధతులపై త్వరలోనే ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్లు పక్కిర్ కొండల్‌రెడ్డి, సతీష్ పవన్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాగరాజు, రమేష్, పండు, జ్యోతి, శంకరయ్య, ప్రమోద్ కుమార్, వెంకటయ్య, నిర్మల, మహేశ్వర్‌రెడ్డి, నర్సింగరావు, రసూల్ పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
భువనగిరి : ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి మండలంలోని ఆకుతోటబావి తండాలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ విజయలక్ష్మీ, ఎంపీఓ దినకర్, ఏపీఓ బాలస్వామి, గ్రామ సర్పంచ్ కేతావత్ నరేందర్, కార్యదర్శి అర్షియా తదితరులు పాల్గొన్నారు.


