సర్కారు బడి పిల్లలకు ‘రవాణా’ భరోసా | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడి పిల్లలకు ‘రవాణా’ భరోసా

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

అన్ని వివరాలు సక్రమంగా ఉండాలి

భువనగిరి: సొంత ఊళ్లో ప్రభుత్వ పాఠశాలల్లేక పక్క గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేక దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతూ, మధ్యలో చదువు మానేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు రవాణా భత్యం అమలు చేస్తోంది. ఆటోలు, ఆర్టీసీ బస్సుల చార్జీల భారం తప్పించేందుకు నెలకు రూ.600 చొప్పున విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

రూ.23.36 లక్షల నిధులు విడుదల

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 1,298 మంది విద్యార్థులను రవాణా భత్యానికి అర్హులుగా గుర్తించారు. వీరికి జూన్‌, జూలై, ఆగస్టు.. మూడు నెలలకు కలిపి ఒక్కొక్కరికి రూ. 1,800 చొప్పున మొత్తం రూ. 23.36 లక్షల నిధులను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

నిబంధనలు ఇవే..

ఈ భత్యం పొందాలంటే విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి. బ్యాంకులో విద్యార్థి పేరుతో లేదా తల్లిదండ్రులతో జాయింట్‌ అకౌంట్‌ తప్పనిసరి. విద్యార్థుల సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు జిల్లా అధికారులకు నివేదిస్తే నిధులు మంజూరవుతాయి.

తల్లిదండ్రులకు తప్పిన ఆర్థిక భారం

జిల్లాలోని 715 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 45,248 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ప్రాథమిక పాఠశాలలకు 1 కి.మీ, ప్రాథమికోన్నత పాఠశాలలకు 3 కి.మీ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు 5 కి.మీల లోపు దూరం నుంచి వచ్చే 1,298 మంది విద్యార్థులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. రోజువారీ కూలి చేసుకునే పేద తల్లిదండ్రులకు తమ పిల్లల ప్రయాణ ఖర్చులు భారంగా మారిన నేపథ్యంలో.. ప్రభుత్వ రవాణా భత్యం వారికి ఎంతో ఊరటనిస్తోంది.

స్థానికంగా పాఠశాలలు లేని పిల్లలకు ప్రభుత్వం రవాణా భత్యం మంజూరు చేస్తోంది. 5 కి మీ దూరంలోపు బడిలేని పిల్లల జాబితా రూపొందించాం. విద్యార్థుల వివరాలు సక్రమంగా ఉంటే పరిశీలించి రవాణా భత్యం జమ చేస్తాం. – భిక్షపతి, డీఈఓ

ఫ పక్క ఊరికి వెళ్లి చదువుకునే విద్యార్థులకు నెలకు రూ.600 భత్యం

ఫ జూన్‌, జూలై, ఆగస్టు నెలలవి కలిపి రూ.1,800 విడుదల

ఫ ఖాతాల్లో నేరుగా జమ.. 1,298 మందికి లబ్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement