కోదాడ(కోదాడరూరల్) : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, భారీ నీటిపారుదశాలఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కోదాడలో పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి.. మీడియాతో మాట్లాడారు. యాసంగిలో రైతులు వరి సాగు మానుకొని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కృష్ణా, గోదావరి జలాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వానాకాలంలో సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రస్తుతం వరికోతలు సాగుతున్నాయని, తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు రూ.90 కోట్లు వెచ్చిచామని పేర్కొన్నారు. ఎల్‌నినోతో ఏర్పడిన కరువును బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా వాడుకోవడంపై మండిపడ్డారు. ఏపీకి నీటిని మళ్లీస్తున్నారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మంత్రి స్పష్టం చేశారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటినుంచి కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో బీఆర్ఎస్ హయాంలో కంటే ముందున్నామన్నారు.


