రెండు ఇసుక లారీలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

రెండు ఇసుక లారీలు సీజ్‌

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

తల్లాడ : అనుమతి లేకుండా ఏపీ నుంచి ఇసుక తీసుకొస్తున్న రెండు లారీలను ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని రామానుజవరం వద్ద పోలీసులు బుధవారం సీజ్‌ చేశారు. ఏపీలోని రాజమండ్రి నుంచి తల్లాడ మండలం రామానుజవరం గ్రామానికి వస్తున్న ఇసుక లారీలను తనిఖీ చేయగా అనుమతి లేదని తేలింది. దీంతో లారీలను సీజ్‌ చేయడమే గాక.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిమిర్యాలకు చెందిన సోరిని నరేష్‌, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం శివనేగూడెంకు చెందిన లారీ యజమాని ఝెట్టి నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్‌కు చెందిన ఆరుట్ల రాజు పరారయ్యాడని ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు.

వ్యవసాయ మోటార్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

● 18 మోటార్లు, కారు స్వాధీనం

మోత్కూరు : వ్యవసాయ మోటార్లు చోరీ చేస్తున్న ముఠాను మోత్కూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం మోత్కూరు పోలీస్‌ స్టేషన్‌లో రామన్నపేట సీఐ మొలుగురి రవి వెల్లడించారు. మోత్కూరు మండలం అనాజిపురం ఎక్స్‌ రోడ్డు వద్ద బుధవారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారును ఆపారు. అందులో అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని విచారించగా వ్యవసాయ మోటార్లు చోరీ చేస్తున్నట్లు నిజం అంగీకరించారు. వారి నుంచి 18 వ్యవసాయ మోటార్లు, కారు, నాలుగు సెల్‌ఫోన్లు, చోరీకి ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పగటి పూట గ్రామాల శివార్లలో రెక్కీ నిర్వహించి రాత్రివేళ వ్యవసాయ మోటార్లు దొంగిలించే వారని సీఐ పేర్కొన్నారు. వాటిని పాత ఇనుప సామాను వ్యాపారులకు విక్రయించి వచ్చిన డబ్బులు విలాసాలకు ఖర్చు చేసేవారని తెలిపారు. అరెస్టయిన వారిలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఓర్సు నాగరాజు, రాపాని రమేష్‌, రాపాని శ్రీను, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం కేసారానికి చెందిన పల్లపు మహేందర్‌ ఉన్నారు. వీరిని రామన్నపేట కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ తెలిపారు.

వేడి నీళ్లు మీదపడి చిన్నారి మృతి

మునుగోడు(చింతపల్లి) : వేడి నీళ్లు మీదపడి చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన చింతపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాపురం గ్రామానికి చెందిన చెట్టిపల్లి నాగార్జున్‌, గంగోత్రి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సహశ్రీ(6), భానుశ్రీ ఉన్నారు. ఈ నెల 3న చిన్నారులకు స్నానం చేయించడానికి గంగోత్రి హీటర్‌తో నీటిని వేడి చేసింది. ఆ వేడి నీళ్లలో చల్లటి నీళ్లు కలిపేందుకు గంగోత్రి వెళ్లగా చిన్నారి సహశ్రీ ఆడుకుంటూ వెళ్లి వేడి నీటి బకెట్‌కు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు గొడుకొండ్లలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 9న హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలి తండ్రి నాగార్జున్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యార్థి మృతి

ఫ మరొకరికి తీవ్ర గాయాలు

నాగోలు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టి విద్యార్థి మృతిచెందాడు. మరో వ్యక్తి గాయాపాలయ్యాడు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా పీఏపల్లికి చెందిన నారాయణదాస్‌ వెంకన్న కుమారుడు శ్రావణ్‌(22) ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో ఉంటూ.. నగరంలో డిగ్రీ చదువుకుంటున్నాడు. బుధవారం రాత్రి కర్మన్‌ఘాట్‌లోని టీకేఆర్‌ కళాశాల నుంచి హస్తినాపురం వైపు ద్విచక్ర వాహనంపై అతడి బంధువు కోటేష్‌తో కలిసి వస్తున్నాడు. సాగర్‌ రింగ్‌ ప్లైఓవర్‌ నుంచి హస్తినాపురం వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్‌ నుంచి వెళ్తున్నారు. వీరి వెనుకల వచ్చిన మరో వాహనం వేగంగా వెళ్లిపోవడంతో శ్రావణ్‌ నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రవణ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందకపోవడంతో ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ద్విచక్ర వాహనంపై కూర్చుకున్న కోటేష్‌ గాయాలతో బయటపడ్డారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement