నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని చైతన్యపురి కాలనీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తల్లి నాగం శ్రీదేవి నివాసాన్ని బుధవారం జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యురాలు నివేదితా సుబ్రమణియన్, సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సందర్శించారు. కొన్ని రోజుల కిత్రం శ్రీదేవి నివాసంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ధ్వంసమైన వస్తువులు, ఆస్తి నష్టం, అందుబాటులో ఉన్న వివరాలను సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌కు నివేదించనున్నట్లు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా బాధ్యులను గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాగం శ్రీదేవి, నాగం వర్షిత్‌రెడ్డి కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడి వెనుక మంత్రి కోమటిరెడ్డి ప్రోద్బలం ఉందనే అనుమానం ఉందని ఫిర్యాదు చేసినట్లు నాగం వర్షిత్‌రెడ్డి తెలిపారు. నల్లగొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నివేదిత సుబ్రమణియన్‌కు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మొక్క అందజేసి స్వాగతం పలికారు.
ఆర్టీసీ బస్సులో
గుండెపోటుతో వ్యక్తి మృతి
సూర్యాపేట(పెన్‌పహాడ్) : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తు న్న వ్యక్తి సీట్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామ శివారులో బుధవారం జరిగింది. మాచారం గ్రామానికి చెందిన మందుల వెంకన్న(49) నల్లగొండ బాలల హక్కుల పరిరక్షణ విభాగంలో లీగల్ అధి కారిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే బస్సులో పెన్‌పహాడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
భర్త కళ్లముందే
భార్య దుర్మరణం
ఫ టిప్పర్ ఢీకొని మృతి
హుజూర్‌నగర్(నేరేడుచర్ల) : భర్త కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం నేరేడుచర్లలో జరిగింది. ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన బొమ్మని వెంకన్న, సూరమ్మ(40) దంపతులు చిలక జోస్యం చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు బుధవారం ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ నుంచి హుజూర్‌నగర్ వైపు వెళ్తుండగా.. నేరేడుచర్ల వద్దకు రాగానే టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైల్వే బెడ్‌రోల్ అటెండర్ అరెస్టు
ఫ నిందితుడు భువనగిరి జిల్లా వాసి
సికింద్రాబాద్: రైలులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును దొంగిలించిన బెడ్‌రోల్ అటెండర్‌ను సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.5.20లక్షల విలువ చేసే 40 గ్రాముల బంగారు గొలుసును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బొల్లపల్లి సాయిరాం(26) చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో బెడ్‌రోల్ అటెండర్. ఆదివారం రైలు బీ1 కోచ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకున్న సమయంలో బెర్త్‌పై ఉన్న దిండు కింద బంగారు గొలుసు తీసుకున్నాడు. ఈ నెల 11న గొలుసు విక్రయించేందుకు సికింద్రాబాద్‌కు వచ్చాడు. అదే సమయంలో ఎస్‌ఐ సుబ్బారెడ్డి నేతృత్వంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రైం టీమ్‌కు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించి గొలుసును పోలీసులకు అప్పగించాడు.


