మిర్యాలగూడ(వేములపల్లి) : ధాన్యం ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా... పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లికి చెందిన రైతు కాంతారెడ్డి తాను పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో లోడ్ చేయగా.. డ్రైవర్ కుంచం ఎల్లయ్య శెట్టిపాలెం శివారులోని రైస్ మిల్లు వద్దకు తీసుకొచ్చాడు. అదే సమయంలో మహాతేజ రైస్‌మిల్లులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెదపంగ వెంకటయ్య విధులు ముగించుకుని బయటకు వచ్చి ఎల్లయ్య ట్రాక్టర్ ఎక్కాడు. ట్రాక్టర్ మరో మిల్లు వైపు వెళ్తుండగా.. మిర్యాలగూడ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు టైర్లు విరిగిపోగా.. ట్రాక్టర్‌పై కూర్చున్న పెదపంగ వెంకటయ్య రోడ్డుపై పడిపోయాడు. అతడిపై ధాన్యం పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ రవినాయక్, కండక్టర్ యాదగిరితో పాటు మరో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెదపంగ వెంకటయ్యకు తలకు గాయం కాగా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సురేష్‌రెడ్డి తెలిపారు.
ఫ ఒకరికి తీవ్ర గాయాలు


