ఆ 38 గుంటల భూమి ఎవరిది?
సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులు
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రీజినల్ రింగ్‌రోడ్డు భూసేకరణ పరిహారం పంపిణీలో అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. భూసేకరణ, పరిహారం ఖరారు వంటి అడ్డంకులన్నీ దాటి పంపిణీకి సిద్ధమైన రెవెన్యూ అధికారులకు.. ఇప్పుడు దశాబ్దాల నాటి ప్లాట్ల యజమానుల ఆచూకీ దొరకకపోవడం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. నిధులు సిద్ధంగా ఉన్నా తీసుకునేవారు లేకపోవడంతో.. గత రెండు నెలలుగా పరిహారం అందించేందుకు అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆ మూడు గ్రామాల్లో 200 ఎకరాల సేకరణ
తెలంగాణకే మణిహారంగా భావిస్తున్న రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ పూర్తయింది. జిల్లా పరిధిలో రాయగిరి మినహాయించి పరిహారం సొమ్ము పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చౌటుప్పల్, లింగోజిగూడెం, తాళ్లసింగారం గ్రామాల్లో సుమారు 200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందులో వ్యవసాయ భూములతో పాటు ప్లాట్లు కూడా ఉన్నాయి. వ్యవసాయ భూముల పరిహారం చెల్లింపు ప్రక్రియ సాఫీగానే సాగుతోంది. కానీ ప్లాట్లకు సంబంధించి పరిహారం చెల్లింపు విషయం మాత్రం అధికారులకు సవాల్‌గా మారింది.
233 ప్లాట్ల యజమానులెవరో?
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి వెంట ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం పక్కన సర్వే నంబర్ 243లో ఉన్న వెంచర్ నుంచి 180 ప్లాట్లను రీజినల్ రింగ్‌రోడ్డు కోసం సేకరించారు. కానీ, ఇందులో ఇప్పటివరకు కేవలం 47 మంది ప్లాట్ల యజమానులు మాత్రమే రెవెన్యూ అధికారులను కలిసి డాక్యుమెంట్లు సమర్పించారు. మిగిలిన 133 మంది జాడ తెలియడంలేదు. అలాగే, తాళ్లసింగారం పరిధిలోని సర్వే నంబర్ 20, 22లలో లింగారెడ్డిగూడెం మర్లమైసమ్మ దేవాల యం ఎదురుగా 123 ప్లాట్లను సేకరించగా.. కేవలం 23 మంది మాత్రమే పరిహారం కోసం ముందుకొచ్చారు. ఇక్కడ మరో 100 మంది యజమానుల జాడ తెలియాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని వివరాలు క్షేత్రస్థాయిలో సరిపోలకపోవడం, దశాబ్దాల క్రితం నాటి వెంచర్లు కావడం, ఇతర రాష్ట్రాల వారు కొనుగోలు చేసి ఉండటం వల్ల యజమానుల ఆచూకీ దొరకడం లేదు. కొన్ని ప్లాట్లు తప్పుడు రిజిస్ట్రేషన్లకు గురైనట్లు కూడా అనుమానిస్తున్నారు. దీంతో జీపీఓ నుంచి ఆర్డీఓ వరకు అధికారులందరికీ ఇదో పెద్ద తలనొప్పిగా మారింది.
చౌటుప్పల్, తాళ్లసింగారం గ్రా మాల పరిధిలో సుమారు 200 ప్లాట్లకు యజమానులు ఎవరో తెలియడంలేదు. రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి సేకరంచిన వివరాలు కూడా సరిపోవడంలేదు. రెండు గ్రామాలలో కలిపి 303ప్లాట్లకుగాను ఇప్పటి వరకు కేవలం 70మంది మాత్రమే వచ్చి డాక్యుమెంట్లు ఇచ్చారు. ఇంకా 233మంది జాడ తెలియాల్సి ఉంది. ప్రయత్నాలు ఫలించకపోతే పరిహారం కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
–గుత్తా వెంకట్‌రెడ్డి, ఆర్‌ఐ, చౌటుప్పల్
ఫ పరిహారం పంపిణీకి అధికారులు సిద్ధౖమైనా దొరకని భూ యజమానుల ఆచూకీ
ఫ చౌటుప్పల్, తాళ్లసింగారం పరిధిలో 233 ప్లాట్ల ఓనర్ల కోసం ఆరా
ఫ 38 గుంటల వ్యవసాయ భూమి రైతు కోసం కూడా..
ప్లాట్ల పరిస్థితి అలా ఉంటే.. ఓ వ్యవసాయ భూమి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. చౌటుప్పల్ పట్టణంలోని శ్రీని ఫార్మా సమీపంలో కోణార్క్ స్టీల్ కంపెనీ వెనుక సర్వే నంబర్ 255లో 38 గుంటల వ్యవసాయ భూమిని సేకరించారు. 38 గుంటల భూమికి యజమాని ఎవరు అనేది ఇప్పటికీ తెలియలేదు. ఈ విషయమై అధికారులు స్థానిక రైతులను ఆరా తీయగా.. ఆ భూమి గూడూరు రేణుక, ఆమె భర్త యాదిరెడ్డికి చెందినదని చెప్పారు. యాదిరెడ్డి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని, ప్రస్తుతం అతను చనిపోయినట్లు తెలిసిందని సమాచారం ఇచ్చారు.అయితే వారిది ఏఊరో స్పష్టమైన అడ్రస్ తెలియడంలేదు. ఇక్కడ ఎకరానికి పరిహారం సొమ్ము రూ.కోటి నుంచి రూ. కోటి 20లక్షల వరకు అందనుంది.


