రామన్నపేట: యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో 17,787 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రూ.123.98 కోట్ల వ్యయంతో కాలువ సామర్థ్యాన్ని పెంచగా.. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పెరిగిన కాలువ సామర్థ్యం, ఆయకట్టు
పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి వద్ద మూసీ కాలువపై ప్రారంభమయ్యే ఈ పాత కాలువ సామర్థ్యం కేవలం 50 క్యూసెక్కులు, ఆయకట్టు 5,126 ఎకరాలు మాత్రమే. దీన్ని 208 క్యూసెక్కులకు పెంచి, అదనంగా 12,661 ఎకరాలకు (మొత్తం 17,787 ఎకరాలు) సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.123.98 కోట్లు మంజూరు చేసింది. ఇందుకోసం 137.27 ఎకరాల భూమిని సేకరించి పరిహారం చెల్లించారు.
మూడు భాగాలుగా విస్తరణ
ధర్మారెడ్డిపల్లి నుంచి నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వరకు 51.51 కి.మీ మేర కాలువ విస్తరించి ఉంది. కాలువ అడుగుభాగం (బెడ్ విడ్త్) అవసరాన్ని బట్టి 0కిలోమీటర్ నుంచి 12.41 కి.మీ వరకు 10 మీటర్లు, అక్కడి నుంచి 45.10 కి.మీ వరకు 6 మీటర్లు, ఆ తర్వాత ఏపీ లింగోటం వరకు 3 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. కాలువ డీప్ కట్ అవ్వడం వల్ల ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించేలా..
గత జూలైలో మొదటి దశ పనులు పూర్తి చేసి వలిగొండ మండలంలోని పలు గ్రామాలకు నీరు విడుదల చేశారు. డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో దిగువ ప్రాంతాలకు కూడా సాగునీరు అందించేలా ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేస్తున్నారు.
నీరు సాఫీగా పారేలా స్ట్రక్చర్స్
కాలువ చివరి ఆయకట్టు వరకు నీరు సాఫీగా వెళ్లేందుకు 118 స్ట్రక్చర్స్‌ను ప్రతిపాదించారు. ఇందులో 71 వంతెనలు ఉండగా, ఇప్పటికే 35 పూర్తయ్యాయి. మిగతావి ఈ నెలాఖరుకు పూర్తికానున్నాయి. అలాగే వెల్లంకి పాత చెరువు వద్ద వరదలను తట్టుకునేలా 880 మీటర్ల పొడవైన ప్రొటెక్షన్ వాల్‌ను నిర్మించారు. 2026 డిసెంబర్ నాటికి పనులన్నీ వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.


