భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలో ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు తీసుకోకుండానే పలు వ్యాపార సంస్థలు దర్జాగా కొనసాగుతూ మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్నాయి. పట్టణంలోని 35 వార్డుల్లో దాదాపు 2,500 వాణిజ్య, వ్యాపార సంస్థలు ఉండగా.. సగానికి పైగా దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గతేడాది కేవలం 1,452 దుకాణాలు మాత్రమే లైసెన్సులు తీసుకోగా, ఈ ఏడాది ఇప్పటివరకు పరిమిత సంఖ్యలోనే వ్యాపారులు ఫీజులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. ఫీజుల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ప్రస్తుతం అధికారికంగా లైసెన్సులు తీసుకున్న దుకాణాల ద్వారా మున్సిపాలిటీకి ఏటా రూ.1.08 కోట్ల ఆదాయం వస్తుండగా, మిగిలిన వారందరికీ లైసెన్సులు జారీ చేస్తే మరో రూ.1.10 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిధులు పట్టణ అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.
ౖలెసెన్సుల జారీ, వసూళ్ల
ప్రక్రియను వేగవంతం చేసేందుకు..
లైసెన్సుల జారీ, వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఒక్కో బృందంలో ఇద్దరు సిబ్బంది చొప్పున వార్డుల వారీగా దుకాణాల వద్దకే వెళ్లి నేరుగా తనిఖీలు చేపడుతున్నారు. మొదటి విడతలో ఒక్కో బృందం 100 దుకాణాలను లక్ష్యంగా పెట్టుకుంది. తనిఖీల్లో అక్కడికక్కడే ఫీజు చెల్లించే వారికి అనుమతులు మంజూరు చేస్తుండగా.. చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారం, పది రోజుల్లోగా రుసుము చెల్లించకుంటే మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఫ భువనగిరి మున్సిపాలిటీలో అనుమతులు లేకుండానే సగానికి పైగా వ్యాపారాలు
ఫ 10 ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు
ఫ వంద శాతం వసూలైతే రూ.1.10 కోట్ల అదనపు ఆదాయం
ఫ గడువులోగా ఫీజు చెల్లించకుంటే కఠిన చర్యలు


