సాక్షి, యాదాద్రి : ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలో పేర్లు లేని అర్హులు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించి ఓటరుగా నమోదు చేసుకునే గడువును ఈనెల 21 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి వెల్లడించారు.బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు జాబితాల సవరణ, ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్న ఓటర్లను సంప్రదించి, అవసరమైన అనుబంధ ఫారాలు, డిక్లరేషన్ పత్రాల సమర్పణ విధానాన్ని వివరిస్తారని తెలిపారు. అలాగే వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
ఆలేరురూరల్: విద్యార్థుల హాజరుశాతం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఆలేరు మండలంలోని బహద్దూర్‌పేట ప్రాథమిక పాఠశాలను డీఈఓ భిక్షపతితో కలిసి బుధవారం సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న ప్రీ ప్రైమరీ విద్యాబోధన, అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పీఎం పోషణ్ పథకంలో భాగంగా విద్యార్థులకు వారానికి ఎన్నిసార్లు గుడ్లు అందిస్తున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రీ ప్రైమరీ విద్యార్థుల వయస్సు నాలుగేళ్లు నిండిందా లేదా పరిశీలించారు. తరగతి గది గోడలపై ఉన్న బొమ్మలను చూపిస్తూ వాటి పేర్లు చెప్పాలని విద్యార్థులను అడిగారు. సమాధానాలు చెప్పిన చిన్నారులను అభినందించారు.కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంఈఓ ఎర్ర లక్ష్మి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


