యాదగిరిగుట్ట : సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన, తుర్కపల్లి మండలం కొండాపురానికి చెందిన ఆర్మీ జవాన్ పల్లపు మహేందర్ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్ (ఆర్మీ ఆర్డినెన్స్ కోర్), టీఏఎస్‌ఏ హెడ్‌క్వార్టర్స్ (తెలంగాణ) ఆధ్వర్యంలో ప్రభుత్వ, మిలటరీ అధికారిక లాంఛనాలతో కొండాపురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. భారతీయ ఆర్మీ విభాగంలో ఎనిమిదేళ్లుగా దేశానికి సేవలు అందిస్తూ, రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన మహేందర్ కుటుంబ సభ్యులను ఏఓసీ సెంటర్ అధికారులు పరామర్శించారు. మహేందర్ మృతదేహంపై జాతీయ జెండాను కప్పి, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో ఏఓసీ సెంటర్ ఆర్మీ అధికారులు, యాదాద్రి భువనగిరి జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్, తుర్కపల్లి ఎస్‌ఐ శివకృష్ణ, బొమ్మలరామారం ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్‌లతో పాటు జిల్లాకు చెందిన ఆర్మీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫ మిలటరీ అధికారిక లాంఛనాలతో నివాళి


