అర్వపల్లి : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లి శివారులోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. రాత్రి 7.30 గంటలకు అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ అహ్మద్, జిల్లా ఇన్‌స్పెక్టర్ దస్తగిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్‌రెడ్డి, అర్వపల్లి దేవాలయ చైర్మన్ బీరవోలు విక్రంరెడ్డి, డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్, మాజీ జెడ్పీటీసీ అవిలయ్య, శిగ నసీర్‌గౌడ్, స్థానిక ఎస్‌ఐ పి. మధు, ముజావర్ అలీ గంధంతో ఊరేగింపుగా వై జంక్షన్ వరకు వచ్చారు. ఊరేగింపునకు ముందు పకీర్లు జరబ్ నిర్వహించారు. తొలిరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉర్సు సందర్భంగా దర్గా వద్ద వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. దర్గా ఫౌండర్ కుమారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ హుస్సేన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్, లునావత్ కృష్ణనాయక్, నాయకులు అమీనుద్దీన్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. ఉర్సు సందర్భంగా తుంగతుర్తి, సూర్యాపేట రూరల్ సీఐలు ఉపేందర్‌రావు, రాజశేఖర్, స్థానిక ఎస్‌ఐ పి. మధు 80మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
వైభవంగా గంధం ఊరేగింపు
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు


