సాక్షి, యాదాద్రి : వ్యవసాయంలో పంటల మార్పిడికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మునగ సాగు, గృహ నిర్మాణ పథకం రెండో విడత మంజూరు, ఉపాధి హామీ పనుల పురోగతిపై బుధవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మునగ సాగు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరిస్తూ, ఆసక్తి గల రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఇంటి పైకప్పుల మార్పిడికి అర్హులైన వారిని గుర్తించి, గెజిటెడ్ అధికారితో క్షేత్రస్థాయి పరిశీలన చేయించిన అనంతరమే తుది జాబితాలు పంపాలని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ అలివేలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
భువనగిరి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలసంఖ్య పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం భువనగిరి మండలం బొల్లేపల్లి పీహెచ్సీతో పాటు స్థానికంగా రైతు మహేందర్ 15 ఎకరాల్లో సాగు చేసిన మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. మునగసాగు ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం పట్టణశివారులోని మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ , డీఏఓ వెంకటరమణారెడ్డి , డీఆర్ఓ జయమ్మ, వైద్యాధికారి యామిని శృతి పాల్గొన్నారు.


