మిర్యాలగూడ (మిర్యాలగూడ టౌన్) : సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్‌టక్‌లో ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న యోనెక్స్–సన్‌రైజ్ 49వ ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్, జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొనే అండర్–19 తెలంగాణ జట్టుకు కోచ్‌గా మిర్యాలగూడ ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ కోచ్ ఎం. రామకృష్ణ ఎంపికయ్యారు. బుధవారం రామకృష్ణను డీవైఎస్‌ఓ అక్బర్ అలీ, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జి. అంజయ్య, అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, నవీన్‌కుమార్ అభినందించారు.
పోచంపల్లిని సందర్శించిన బెల్జియం పర్యాటకురాలు
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లిలోని టూరిజం పార్కును బెల్జియం దేశానికి చెందిన పర్యాటకురాలు బుధవారం సందర్శించారు. టూరిజం పార్కులో మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, డిజైన్లు, నాణ్యతను పరిశీలించి చేనేత కళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. ఇక్కత్ వస్త్రాలకు ఉన్న ప్రాముఖ్యత, భూదానోద్యమ చరిత్రను తెలుసుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా పోచంపల్లి సందర్శనకు వచ్చినట్లు ఆమె తెలిపారు.
పేలిన ఆర్టీసీ బస్సు టైరు
ఫ డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
చౌటుప్పల్ : నల్లగొండ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తుండగా.. చౌటుప్పల్ పట్టణంలోని పైలాన్ పార్కు వద్దకు చేరుకోగానే బస్సు ముందు ఎడమ వైపు టైరు పేలింది. ఆ సమయంలో బస్సు అదుపు తప్పకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. బస్సులోని ప్రయాణికులు మరో బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
దేవరకొండ: పట్టణ శివారులో బుధవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం ఆంగోతు సీత్యతండాకు చెందిన ఆంగోతు కృష్ణ(35) హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత మూడేళ్లుగా కృష్ణ, అతడి భార్య వేర్వేరుగా ఉంటున్నారు. కృష్ణ ఈ నెల 2వ తేదీన తన అత్తగారి ఊరైన పెద్దఅడిశర్లపల్లికి వెళ్లి భార్యను చూసివస్తానని హైదరాబాద్ నుంచి బయల్దేరాడు. కాగా బుధవారం ఉదయం దేవరకొండ పట్టణ శివారులో బెల్లంకుంట సమీపంలోని ఓ చెట్టు కింద అతడు విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మరిపెడలో
గంజాయి పట్టివేత
ఫ నిందితుల్లో సూర్యాపేట జిల్లావాసి
మరిపెడ రూరల్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసుల తనిఖీల్లో గంజాయి అక్రమ దందా వెలుగుచూసింది. రూ.లక్ష విలువైన 2కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మరిపెడ సీఐ ఎల్.పవన్‌కుమార్ బుధవారం తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మరిపెడ శివారు తొర్రూరు రోడ్డులో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న బ్యాగులో గంజాయి లభించింది. విచారణలో నిందితులు మరిపెడకు చెందిన పవార్ విజయ్, భూపాలపల్లి జిల్లా దామరాంచపల్లి గ్రామానికి చెందిన కంది అభిరామ్, సూర్యాపేట జిల్లాకు చెందిన బానోతు మణిదీపక్‌గా గుర్తించారు. నిందితుల నుంచి 2కిలోల గంజాయితోపాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక డిజిటల్ వేయింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
మందుబాబులకు
జైలుశిక్ష, జరిమానా
కోదాడ(కోదాడరూరల్) : కోదాడ పట్టణంలో మంగళవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 22 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ ఎస్సై బైరెడ్డి అంజిరెడ్డి బుధవారం తెలిపారు. వారిని కోదాడ కోర్టులో హాజరుపర్చగా.. ఏడుగురికి ఒక్కరోజు జైలుశిక్ష, రూ.1000 చొప్పున జరిమానా, మరొకరికి రెండు రోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా, మిగతా 14 మందికి రూ.13,500 జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఎండీ ఉమర్ తీర్పు వెలువరించినట్లు ఎస్సై తెలిపారు.


