ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆలిండియా సివిల్ సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధలో శిక్షణ పొందుతున్న 2024, 2026 బ్యాచ్‌లకు చెందిన ఐదుగురు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామంలో పర్యటించారు. వారి పర్యటన బుధవారంతో ముగిసింది. ఏపూరు గ్రామంలో మూడు రోజులుగా వివిధ శాఖలపై సమీక్షలు, ప్రజల భాగస్వామ్యం, రైతుల స్థితిగతులు తదితర విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, అధికారుల పనితీరు, ప్రజల భాగస్వామ్యంతో పాటు గ్రామంలో వ్యవసాయం తీరు, పంటల వివరాలు, నీటి వనరులు, వ్యవసాయంలో లాభనష్టాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్ధులకు అందుతున్న విద్య, పౌష్టికాహారంతో పాటు సమభావన సంఘాల్లో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు. అదేవిధంగా బాలికల చదువులో ఇక్కడి ప్రాంతం ముందుందని, పరిపాలనలో సైతం మహిళల భాగస్వామ్యం ఉందని గుర్తించామన్నారు. కొన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ బాల్యవివాహాలు తక్కువ అని, వ్యవసాయం బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేయడం గుర్తించామని తెలిపారు. ఏపూరు గ్రామ ప్రజలతో మమేకమై ఇక్కడి ప్రజల నుంచి తో నేర్చుకున్నామని వారు తెలిపారు.
ఫ ఏపూరులో పర్యటించిన
సివిల్ సర్వీసెస్ అధికారులు
ఫ వ్యవసాయం, మహిళ
భాగస్వామ్యం తదితర
అంశాలపై అధ్యయనం


