చౌటుప్పల్ : కారును సిమెంట్ లారీ ఢీకొట్టిన ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డు సమీపంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ మార్గంలో వెళ్తున్న కారు అకస్మాత్తుగా హైవే పైకి వెళ్లడంతో వెనుక నుంచి వచ్చిన సిమెంట్ లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో అండర్‌పాస్ బ్రిడ్జి కోసం తీసిన గుంతలో కారు పడిపోయింది. స్థానికులంతా కలిసి కారును గుంతలో నుంచి బయటకు తీశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు కారును పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
మహిళను వేధిస్తున్న
యువకుడి రిమాండ్
యాదగిరిగుట్ట: మహిళను వేధిస్తున్న యువకుడిపై తుర్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు పంపించారు. తుర్కపల్లి ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామానికి చెందిన వంగూరి చందు కొన్ని రోజులుగా ఓ మహిళ వెంట పడుతూ.. ఆమె వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధిత మహిళ తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వంగూరి చందుపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక విద్యార్థి ఆత్మహత్య
హాలియా(నిడమనూరు) : హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిడమనూరులో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రంలోని యాదవకాలనీకి చెందిన పున్న మారయ్య, హేమలత దంపతులు తమ దూరపు బంధువులైన గట్టుప్పల్‌కు చెందిన రావిరాల నాగమణి, నాగరాజు దంపతుల కుమారుడు కార్తీక్(14)ను దత్తత తీసుకున్నారు. కార్తీక్ నిడమనూరు శివారులోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల అనంతరం కార్తీక్‌కు హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో మారయ్య, హేమలత దంపతులు పలుమార్లు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కార్తీక్ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.


