నాంపల్లి : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం వల్ల మారుమూల తండాలలో ఫ్లోరోసిస్ సమస్య పూర్తిగా పోతుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ అనిమేశ్ భట్టాచార్య అన్నారు. బుధవారం ఆయన నాంపల్లి మండలంలోని రామదాస్‌తండా గ్రామాన్ని సందర్శించి.. ఇంటింటికీ తిరుగుతూ మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో బోరు నీటిపైనే ఆధారపడేవారమని, ఫ్లోరైడ్ నీటి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని గ్రామస్తులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట మిషన్ భగీరథ ఎస్‌ఈ నాగేశ్వరరావు, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ అజయ్‌కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ రామకృష్ణ శర్మ, సర్పంచ్ మెగావత్ చిట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడలో..
మునుగోడు(మర్రిగూడ) : మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ అనిమేశ్ భట్టాచార్య సందర్శించి గ్రామంలో తాగునీటి సరఫరా, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి శాలినిని కలిసి ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, గతంలో గ్రామంలో ఉన్న ఫ్లోరోసిస్ పరిస్థితులు, మిషన్ భగీరధ ద్వారా రక్షిత మంచినీటి సరఫరా ప్రారంభమైన తర్వాత వచ్చిన మార్పుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, సర్పంచ్ లపంగి నరసింహ, ఉప సర్పంచ్ సైదులు పాల్గొన్నారు.
ఫ జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ అనిమేశ్ భట్టాచార్య


