భువనగిరి: ఎల్‌నినో కారణంగా రానున్న రోజుల్లో నీటి కొరత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. సాగు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ భూగర్భ జలాల పెంపు, నీటి పొదుపు కోసం పక్కా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. మున్సిపాలిటీల్లో వాడవాడలా పర్యటిస్తూ స్థానికులకు నీటి పొదుపుపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తాగునీటి పైపుల లీకేజీలకు అడ్డుకట్ట వేసి, నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నీటిని వృథా చేసే వారికి జరిమానాలు సైతం విధించనున్నారు.
ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో..
గతంలో కొనసాగిన వినియోగదారుల సంఘాల మాదిరిగానే, ఇప్పుడు భూగర్భ జలాల పరిరక్షణ కోసం భూగర్భ జల వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఘాల్లో సాధారణ ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తారు. ఈ సంఘాల సభ్యులందరికీ నీటి పొదుపుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండేలా వీరు ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.
ఇంకుడు గుంత లేకుంటే ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్
జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూర్ ఇలా ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించే ఇళ్లకు లేదా ఇతర నిర్మాణాలకు ఇంకుడు గుంత తప్పనిసరి చేశారు. ఇంకుడు గుంత లేని ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్ రద్దు చేయనున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి యజమానులకు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, భూగర్భంలోకి వర్షపు నీరు ఇంకేందుకు దోహదపడే పాత బావులను పూడ్చకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
మూడురోజులకు
ఒక్కసారి నీళ్లు వస్తున్నాయి
గతంలో కంటే ఇప్పుడు నీటిసమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మూడురోజులకు ఒక్కసారి నల్లా ద్వారా నీళ్లు వస్తున్నాయి. ఈ నీరుసరిపోవడం లేదు. నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాలనీలో కొత్త బోరు వేసి నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని పలు మార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న కాలనీకి నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.
–టి. చంద్రశేఖర్, భువనగిరి
నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వార్డుల వారీగా సభలు నిర్వహించి నీటి పొదుపుపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తాగునీటి విషయంలో ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలి. జల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి. – చంద్రప్రకాష్‌రెడ్డి,
భువనగిరి మున్సిపల్ కమిషనర్
ఫ ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి నివారణకు మున్సిపాలిటీల యాక్షన్ ప్లాన్
ఫ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం
ఫ పాత బావుల పరిరక్షణ.. భూగర్భ జలాల పెంపునకు వినియోగదారుల సంఘాల ఏర్పాటు


