సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

భువనగిరి : డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ సూచించారు. మంగళవారం ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో సైబర్‌ నేరాల నివారణ,సైబర్‌ భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, మెసెజ్‌లు, అనుమానాస్పదలింకులు, నకిలీ వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరితోనూ ఓటీపీ, యూపీఐ, పిన్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని చెప్పారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌తో పాటు సంబంధిత వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు నాగరాజు, అశోక్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రికి విన్నపం

సాక్షి, యాదాద్రి : తెలంగాణలో పెరుగుతున్న రవాణా అవసరాలు, పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి సమర్పించినట్లు ఎంపీ తెలిపారు. సంగారెడ్డి – నర్సాపూర్‌ – తూప్రాన్‌ – గజ్వేల్‌ – జగదేవ్‌పూర్‌ – భువనగిరి – చౌటుప్పల్‌, చౌటుప్పల్‌ – ఆమనగల్‌ – షాద్‌నగర్‌ – సంగారెడ్డి మార్గాలకు జాతీయ రహదారి హోదా కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. రూ.45 వేల కోట్ల వ్యయంతో మెట్రో కారిడార్‌ వెంబడి 10 నూతన గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రహదారులను నిర్మించి, ఔటర్‌ రింగ్‌ రోడ్డును ప్రాంతీయ రింగ్‌ రోడ్డుతో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి స్పందిస్తూ, కొత్త జాతీయ రహదారుల ప్రకటనకు సంబంధించిన విధివిధానాలు ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉన్నాయని, మార్గదర్శకాలు ఖరారైన అనంతరం పరిశీలించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ పేర్కొన్నారు.

బస్టాండ్లను తీర్చిదిద్దాలని మంత్రి పొన్నంకు వినతి

భువనగిరిటౌన్‌ : భువనగిరి, వలిగొండ బస్టాండ్‌లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దడంతో పాటు నియోజకవర్గంలో అదనపు బస్సు సర్వీసులు నడపాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నియోజకవర్గంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భువనగిరి, వలిగొండ బస్టాండ్‌లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు కొత్త బస్సులను కేటాయించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

5న హుండీల లెక్కింపు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలును ఈ నెల 5వ తేదీన లెక్కించనున్నట్లు ఈఓ భవానీ శంకర్‌ మంగళవారం తెలిపారు. ఉదయం 7గంటలకు కొండ కింద గల శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం హాల్‌లో హుండీలను లెక్కిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement