క్షతగాత్రులకు ఆసరా.. పీఎం రాహత్‌ | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు ఆసరా.. పీఎం రాహత్‌

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

పోర్టల్‌ ద్వారా ఆసుపత్రులకు చెల్లింపులు

భువనగిరిటౌన్‌ : రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చకపోవడం, చేర్చినా డబ్బులు లేక చికిత్స ఆలస్యమై ప్రాణాలు పోతున్న ఘటనలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘పీఎం రాహత్‌’ (ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి చేరిక, ట్రామా కేర్‌ పథకం)ను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్‌ అవర్‌)లో బాధితులకు తక్షణమే పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు నిలపడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

ప్రమాదం జరిగినప్పటి

నుంచి ఏడు రోజుల పాటు

ఈ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి బాధితుడికి గరిష్టంగా రూ.1,50,000 వరకు నగదు రహిత అత్యవసర వైద్య సేవలు అందుతాయి. ప్రమాదం జరిగిన రోజు నుంచి గరిష్టంగా ఏడు రోజుల పాటు ఈ సేవలు వర్తిస్తాయి. ఐసీయూ బెడ్‌, శస్త్రచికిత్సలు, రక్త మార్పిడి, అత్యవసర మందులు, డయాగ్నోస్టిక్స్‌ వంటి కీలకమైన ట్రామా కేర్‌ చికిత్సలన్నీ ఈ ప్యాకేజీ పరిధిలోకి వస్తాయి. నేషనల్‌ హెల్త్‌ అథారిటీ, ఆయుష్మాన్‌ భారత్‌ జాబితాలో నమోదైన ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ చికిత్స లభిస్తుంది. ఎంపానెల్డ్‌ ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రమాద బాధితులను చేర్చుకోవడానికి నిరాకరించడానికి వీల్లేదు. రోగి పరిస్థితిని స్థిరీకరించే వరకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంటుంది.

బాధితులు ఎక్కడి వారైనా..

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా, గ్రామీణ రోడ్లపై ఏ మోటారు వాహనం వల్ల ప్రమాదం జరిగినా బాధితులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవు. బాధితులు ఎక్కడి వారైనా, ఏ ప్రాంతంలో ప్రమాదం జరిగినా సమీపంలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో ఉచితంగా అత్యవసర వైద్యం పొందవచ్చు.

ఫ గోల్డెన్‌ అవర్‌లో ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం సరికొత్త పథకం

ఫ బాధితులకు రూ.1.50 లక్షల వరకు నగదు రహిత అత్యవసర చికిత్స

ఫ ఆదాయ పరిమితులు లేకుండా అందరికీ వర్తింపు

క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించినందుకు అయ్యే ఖర్చును ఆసుపత్రులు.. కేంద్ర ప్రభుత్వ మోటారు వెహికల్‌ యాక్సిడెంట్‌ ఫండ్‌ నుంచి నేరుగా రీయింబర్స్‌మెంట్‌ పొందుతాయి. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా జరుగుతుంది. రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, రవాణా శాఖ, ఆరోగ్య విభాగాల సమన్వయంతో బాధితులకు సంబంధించిన వివరాలు పోర్టల్‌లో నమోదవుతాయి. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు పీఎం రాహత్‌ అత్యంత కీలకమైన రక్షణ కవచంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement