భువనగిరిటౌన్ : పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్ క్రాస్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులు, యువతలో సేవాభావం పెంపొందించాలని కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే యువతను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను కూడా పెంచాలని పేర్కొన్నారు. యువత రక్తదానం చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాలు, విద్యాసంస్థల్లో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు దివీస్ సంస్థ సహకారం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంపై విద్యార్థులు, యువత, మహిళలకు అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌నినోపై అవగాహన కోసం రూపొందించిన కరపత్రాలను ఈ సందర్భంగా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బి. సురేష్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ సద్ది వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డి బాలాజీ, ట్రెజరర్ ఎం.ఏ. రహీం, స్టేట్ కమిటీ సభ్యుడు డాక్టర్ జి. లక్ష్మీ నరసింహారెడ్డి, ఎస్‌ఎన్‌చారి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


