గట్టుప్పల్, రామన్నపేట : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) మరింత బలో పేతం చేసి, రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ సంఘాలను రైతు ఉత్పత్తి సంస్థలుగా(ఎఫ్‌పీఓ) మారుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. మొదటి దశలో 37 సొసైటీల్లో ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయుటకు రైతుల నుంచి సభ్యత్వాలు స్వీకరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 13, సూర్యాపేట జిల్లాలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 15 సొసైటీలను ఎంపిక చేశారు.
750 మంది రైతులతో.. రూ.15 లక్షల సబ్సిడీ
రైతు ఉత్పత్తిదారుల సంస్థగా ఏర్పడే కేంద్రంలో 750 మంది రైతులకు సభ్యత్వం కల్పిస్తారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ప్రాథమిక సభ్యత్వం కలిగిన వారికి మాత్రమే రైతు ఉత్పత్తిదారుల సంస్థలో రూ.2వేలు సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యులుగా చేరుటకు అవకాశం కలదు. రైతులు చెల్లించిన మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం మరో రూ.2 వేలు చొప్పున సబ్సిడీ అందజేస్తుంది. ఇలా 750 మంది రైతులు రూ.15 లక్షలు సమకూర్చుకోగా.. కేంద్ర ప్రభుత్వం మరో రూ.15 లక్షల వరకు గ్రాంట్ అందిస్తుంది. అంతేకాకుండా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, నాబార్డు ద్వారా రూ.2 కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. ఈ నిధులతో ఎఫ్‌పీవోలు గ్రేడింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, మినీ రైస్ మిల్లులు, ప్యాకింగ్ కేంద్రాలు, సూపర్ మార్కెట్‌లు, మీసేవా కేంద్రాలు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహించవచ్చు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యత్వం కలిగిన రైతులు సమాన వాటాలుగా తీసుకునే అవకాశం ఉంది.
దళారులకు చెక్.. మెరుగైన సేవలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఎరువుల అమ్మకాల్లో మొదటగా ఎఫ్‌పీవోలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. దళారుల ప్రమేయం లేకుండా సభ్యులే నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. నేరుగా కంపెనీల నుంచే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి స్థానిక రైతులకు హోల్‌సేల్ ధరలకే విక్రయిస్తారు. అంతేకాకుండా ఎఫ్‌పీఓల ద్వారా నిర్వహించే విక్రయ కేంద్రాల ద్వారా సభ్యత్వం కలిగిన రైతులకు అవసరమైన వస్తువులను ఎమ్మార్పీ రేట్లకే సమకూర్చడంతో పాటు ఉచితంగా భూసార పరీక్షలు చేయడం, నాణ్యమైన వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ ఎఫ్‌పీఓలను క్లస్టర్ బేస్డ్ బోర్డు ఆర్గనైజేషన్(సీబీబీఓ) హైదరాబాద్ కేంద్రంగా పర్యవేక్షిసుది. ప్రతీ సంఘానికి కేంద్ర ప్రభుత్వమే ఈక్విటీ గ్రాంట్ క్రింద రూ.15లక్షలు, నిర్వహణకు ఏటా రూ.6 లక్షల చొప్పున మూడేళ్ల పాటు చెల్లిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకానున్న ఎఫ్‌పీఓలు ఇవే..
నల్లగొండ జిల్లా : శాలిగౌరారం, కట్టంగూర్, నార్కట్‌పల్లి, కేతేపల్లి, వెలిమినేడు, గుండ్రాంపల్లి, పెద్దవూర, దేవరకొండ, చండూరు, తిప్పర్తి, దామరచర్ల, గుర్రంపోడు, గొల్లగూడ.
సూర్యాపేట జిల్లా : నడిగూడెం, చిలుకూరు, సూర్యాపేట, చిల్లేపల్లి, మేళ్లచెరువు, పాలకవీడు, నారాయణగూడ, చివ్వెంల, పొనుగోడు
భువనగిరి జిల్లా : గుండాల, చందుపట్ల, రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం, రాజా పేట, తుర్కపల్లి, ఆలేరు, ఆత్మకూర్(ఎం), అడ్డగూడూరు, చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, మోత్కూరు, బొమ్మలరామారం.
ఉమ్మడి జిల్లాలో 37 సొసైటీల ఎంపిక
ఎఫ్‌పీఓల ద్వారా రైతులకు
మెరుగైన సేవలు


