భూదాన్‌పోచంపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి చంద్రయ్య, బాలమ్మ(45) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వివాహితులైన ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో బాలమ్మను భర్త కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె సోమవారం ఉదయం భర్త పొలం పనులకు వెళ్లిన సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత చిన్న కోడలు గమనించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే బాలమ్మ మృతిచెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి తరలిస్తున్న యువకుల రిమాండ్
అడ్డగూడూరు: గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అడ్డగూడూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన కొల్లూరి బన్ని విశాల్, పైసా మధు, మరో మైనర్ బాలుడు గంజాయికి బానిసలయ్యారు. వీరు ముగ్గురు గత నెల 31న నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న వరంగల్‌కు చెందిన వసుకుల మణిదీప్ వద్ద 90 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి ఆటోలో నల్లగొండ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా.. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం టోల్ ప్లాజా వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 90 గ్రాముల గంజాయి, ఆటో, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి.. వసుకుల మణిదీప్‌ను కూడా అదుపులోకి తీసుకుని సోమవారం రామన్నపేట కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం
నార్కట్‌పల్లి: తన ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన నార్కట్‌పల్లి మండల కేంద్రంలో జరిగింది. సోమవారం ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లిలో నివాసముంటున్న నోముల అరుణ జ్యోతికి 8 ఏళ్ల క్రితం రామన్నపేట మండలం నీర్నేములకు చెందిన నోముల వంశీతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో సుమారు రెండేళ్ల క్రితం వారు నార్కట్‌పల్లికి వచ్చి నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడతో అరుణ జ్యోతి తన భర్తకు చెప్పకుండా ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో వంశీ ఫోన్ ద్వారా అరుణ జ్యోతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం ఆమె తండ్రి బాకీ నరసింహ నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆయన తెలిపారు.
విద్యుత్ వైర్లు చోరీ
నకిరేకల్ : నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో విద్యుత్ వైర్లు, ఇతర సామగ్రి చోరీకి గురైన సంఘటన నకిరేకల్‌లోని సంతోష్ నగర్‌లో సోమవారం వెలుగుచూసింది. సంతోష్‌నగర్‌కు చెందిన ఆకుల శ్రీనివాస్ నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే, ఆ ఇంట్లో వేసిన వైరింగ్‌ను, ఇతర సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన సామగ్రి విలువ రూ.2 లక్షలకుపైనే ఉంటుందని బాధితుడు తెలిపాడు.


