హాస్టల్‌ వార్డెన్‌ బూతులు తిడుతున్నాడని.. | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ వార్డెన్‌ బూతులు తిడుతున్నాడని..

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

● పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించిన విద్యార్థులు

చౌటుప్పల్‌ : మండలంలోని నేలపట్ల గ్రామంలోని బీసీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు సోమవారం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. సీఐ డి. సతీష్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ హాస్టల్‌ వార్డెన్‌ సైదులు తమను బూతులు తిడుతున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయారు. నీళ్ల బకెట్లతో కొడుతున్నాడని తెలిపారు. కోడిని కోసినట్టు కత్తితో కోస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. దీంతో పోలీసులు వార్డెన్‌ను పిలిపించి మాట్లాడారు. సోమవారం ఉదయం 9.30గంటలకు హాస్టల్‌ ప్రత్యేకాధికారిగా ఉన్న మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరనాయక్‌ వస్తున్నందున విద్యార్థులను హాస్టల్‌లో ఉండాలని నవ్యుతూ కాస్త గట్టిగా చెప్పానే తప్పిస్తే వేరే ఉద్దేశం లేదని వార్డెన్‌ చెప్పారు. పోలీసులు ఇదే విషయమై మున్సిపల్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేయగా.. తాను హాస్టల్‌కు వెళ్లేది వాస్తవమే అని ఆయన చెప్పారు. విద్యార్థులను ఇకపై ఏమీ అననని వార్డెన్‌ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు సైతం తమ ఫిర్యాదును వాపస్‌ తీసుకున్నారని ఎస్‌ఐ నర్సిరెడ్డి తెలిపారు.

పట్టభద్రులు ఓటుతో

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌ : త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం సాయంత్రం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఓటర్‌ నమోదుపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యావంతులు, నిరుద్యోగులు, పట్టభద్రులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోలేదన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతకు నెలనెలా నిరుద్యోగ భృతి అందిస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎండగట్టాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, యూత్‌ మండల అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్‌, నాయకులు రావిరాల మల్లయ్య, సామ శ్రీనివాస్‌రెడ్డి, యానాల లింగారెడ్డి, పల్లె విజయ్‌, చింత త్రిమూర్తులు, బోయిళ్ల కిశోర్‌, రాచకొండ శ్రవణ్‌, ముక్కాముల శ్రీనివాస్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement