‘గృహజ్యోతి’కి ఎల్‌నినో షాక్‌! | - | Sakshi
Sakshi News home page

‘గృహజ్యోతి’కి ఎల్‌నినో షాక్‌!

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

రామన్నపేట: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వాతావరణ మార్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలం ముగిసి చలికాలం మొదలయ్యే అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. కానీ ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రతతో వేడి తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో గృహ విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగి, ప్రభుత్వం అందిస్తున్న శ్రీగృహజ్యోతిశ్రీ పథకం లబ్ధిపై ప్రభావం చూపే ప్రమాదం ఏర్పడింది. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు మాత్రమే ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. వినియోగ పరిమితి 200 యూనిట్లు ఒక్క యూనిట్‌ దాటినా లబ్ధిదారులు ‘జీరో బిల్లు’కు నోచుకోరని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పెరిగిన సబ్సిడీ భారం

తీవ్ర ఉక్కపోత కారణంగా ఏప్రిల్‌, మే నెలల మాదిరిగానే జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లోనూ గృహ విద్యుత్‌ వాడకం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ప్రభుత్వంపై సబ్సిడీ భారం పెరిగింది. జిల్లాలో గత ఏప్రిల్‌ నెలతో పోలిస్తే అక్టోబర్‌ నాటికి ప్రభుత్వంపై రూ.19 లక్షల మేర అదనపు భారం పడింది. ఏప్రిల్‌లో రూ.5,20,34,201 సబ్సిడీ భారం పడగా, అక్టోబర్‌ నాటికి అది రూ.5,39,14,215 లకు చేరింది. గడిచిన ఏడు నెలల కాలంలో జిల్లాలో గృహజ్యోతి పథకం సబ్సిడీ కోసం ప్రభుత్వం మొత్తం రూ.37,10,47,912 వెచ్చించింది.

పొదుపు పాటించకుంటే షాక్‌ తప్పదు

గృహ వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వినియోగం 200 యూనిట్లు దాటితే జీరో బిల్లు అవకాశాన్ని కోల్పోతారు. ఫ్లోరోసెంట్‌ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వాడటం, పగటిపూట నిరుపయోగంగా లైట్లు వేయకపోవడం, గది నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్‌ చేయడం, ట్యాంకులు నిండగానే మోటార్లు ఆపివేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. తద్వారా గృహజ్యోతి పథకానికి దూరం కాకుండా ఉండటమే కాకుండా ప్రభుత్వంపై పడే సబ్సిడీ భారాన్ని తగ్గించవచ్చు.

ఫ పెరుగుతున్న గృహ విద్యుత్‌ వినియోగం

ఫ 200 యూనిట్లు దాటితే జీరో బిల్లుకు నోచుకోని పరిస్థితి

ఫ ఏప్రిల్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ప్రభుత్వంపై రూ.19 లక్షల అదనపు సబ్సిడీ భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement