ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం
భువనగిరి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లాలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఈ నెల 2వ తేదీ (సోమవారం) నుంచి ప్రత్యేక అధ్యయన తరగతులు నిర్వహించనున్నారు. 2027 మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 8 రకాల అంశాలతో కూడిన ప్రత్యేక మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖ జారీ చేసింది.
కార్యాచరణ ప్రణాళిక ఇలా..
పదో తరగతికి బోధించే ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు డిసెంబర్ నెలాఖరుకల్లా సిలబస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. జనవరి నుంచి పూర్తిగా రివిజన్ తరగతులు నిర్వహించాలి. ఆయా పాఠాల్లోని కీలక అంశాలు, అభ్యసన సామర్థ్యాల వారీగా చర్చలు జరపాలి. వార్షిక పరీక్షల నమూనాలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, మార్కుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఈ తరగతుల నిర్వహణపై ముందుగానే తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి వారి అనుమతి తీసుకోవాలి.
విద్యార్థుల దత్తత
వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని వారికి వ్యక్తిగత విద్యా మార్గదర్శకత్వం అందించాలి. సమయానికి చదువుకునే అలవాటు పెంపొందించేందుకు ఉదయాన్నే వేకప్ కాల్స్ చేయాలి. ఫ్రీ ఫైనల్ పరీక్షల అనంతరం సమగ్ర పనితీరు విశ్లేషణ జరిపి, తుది పరీక్షల సన్నద్ధతకు స్పష్టమైన వ్యూహాలు రచించాల్సి ఉంటుంది.
ఉదయం, సాయంత్రం వేళల్లో..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 715 పాఠశాలలు ఉండగా, వాటిలో 175 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 5,248 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. నవంబర్ నెలాఖరు వరకు సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. అనంతరం డిసెంబర్ నుంచి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు రెండు పూటలా ప్రత్యేక బోధన కొనసాగుతుంది.
జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. అందులో భాగంగా సోమవారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతాయి. 47 రోజుల పాటు సాగే ఈ తరగతుల నిర్వహణ ప్రణాళికను ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు పంపించాం. ప్రస్తుతం సాయంత్రం వేళల్లోనే తరగతులు నడుస్తాయి.
– భిక్షపతి, డీఈఓ
ఫ విద్యార్థులకు 47 రోజుల పాటు కొనసాగనున్న ప్రత్యేక తరగతులు
ఫ సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు బోధన


