ఆలేరురూరల్: జిల్లాలో మూడు నెలల విరామం తర్వాత రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. నవంబర్ నెల కోటాకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జిల్లాకు సుమారు 4,200 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని కేటాయించింది. జిల్లాలోని 2,52,187 రేషన్ కార్డుదారుల కుటుంబాలకు 515 చౌకధరల దుకాణాల ద్వారా ఈ బియ్యాన్ని అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ధరల పెరుగుదల వేళ పేదలకు ఉపశమనం
గత ఆగస్టులో ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు (నవంబర్) రెగ్యులర్ పంపిణీ చేపడుతోంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, అకాల వర్షాలతో పంట నష్టాలు వాటిల్లి బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సన్నబియ్యం సరఫరా కావడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనివ్వనుంది.
బ్లాక్ మార్కెట్‌పై నిఘా ముమ్మరం
రేషన్ బియ్యం పంపిణీ నేపథ్యంలో అక్రమ నిల్వ లు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అక్రమ నిల్వలపై నిఘా పెంచారు.
రేషన్ బియ్యం పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నవంబర్ కోటాకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు రవాణా చేస్తున్నాం. ఇప్పటికే చాలా షాపులకు బియ్యం చేరుకున్నాయి. సోమవారం నుంచి లబ్ధిదారులకు పంపిణీ జరగనుంది.
– హరికృష్ణ, పౌరసరఫరాల శాఖ డీఎం
ఫ నేటి నుంచి మళ్లీ రేషన్ బియ్యం పంపిణీ
ఫ నవంబర్ కోటా కింద జిల్లాకు 4వేల మెట్రిక్ టన్నుల కేటాయింపు


