యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తుల పాదరక్షలను ఉచితంగా భద్రపరిచే సౌకర్యాన్ని ఆదివారం నుంచి ఆలయాధికారులు కల్పించారు. గత కొన్నేళ్లుగా కొండపైన భక్తుల పాదరక్షలు భద్రపరిచే నిర్వహణను టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేవారు. దీంతో భక్తుల పాదరక్షలు భద్రపరిచే టెండర్ దారులు జతకు రూ.2 వసూళ్లు చేసేవారు. ఈ క్రమంలో లైసెన్స్ విధానంతో భక్తులు ఇబ్బందులు పడడంతో పలుమార్లు కొండపైన వివాదాలు ఏర్పడినట్లు ఫిర్యాదులు అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలు, దేవస్థాన ప్రతిష్టకు భంగం లేకుండా ఉండేందుకు పాదరక్షలు భద్రపరిచే నిర్వహణను టెండర్ ద్వారా కాకుండా భక్తుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా అందించే సౌకర్యాన్ని కల్పించాలని ఇటీవల వైటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. దీంతో కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో సంప్రదించి వారి మార్గదర్శకాలతో మెప్మా సంస్థచే యాదగిరిగుట్ట పట్టణ మహిళా సంఘం ద్వారా ఉచితంగా పాదరక్షలు భద్రపరిచే కౌంటర్స్‌ను ప్రారంభించినట్లు ఆలయ ఈఓ భవాని శంకర్ వెల్లడించారు.


