చిట్యాల: వర్షానికి తడిచిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరను చెల్లించి వెంటనే కొనుగోలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. చిట్యాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తడిచిన ధాన్యాన్ని శనివారం ఆయన బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిందని ఆరోపించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఇరవై రోజులు దాడినప్పటికీ కొనుగోళ్లు సకాలంలో ప్రారంభించక, ప్రారంభించిన కేంద్రాలలో జాప్యం చేయడం వల్లనే వర్షాలకు రైతుల పంట నష్టం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలులో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా పోయిందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిస్తుందని ఆరోపించారు. వర్షాలకు పంట నష్టం జరిగినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, కొనుగోలు కేంద్రాలను సందర్శించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, మున్సిపల్ మాజీ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, కౌన్సిలర్లు షబానా అజీమోద్దీన్, నాయకులు జమాండ్ల శ్రీనువాస్‌రెడ్డి, జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్‌రెడ్డి, ఆగు అశోక్, రుద్రవరం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


