పంట కోత
సాధారణంగా పూత దశ నుంచి 30–40 రోజులకు పెసర పరిపక్వతకు చేరుకుంటుంది. కాయలు పసుపు రంగుకు, ఆ తర్వాత నలుపు రంగుకు మారతాయి. ఆకులు పసుపు వర్ణం దాల్చి నిదానంగా ఎండిపోతాయి. 80 శాతం కాయలు ఎండిన దశలో పంటను కోసినచో అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది.
పంట దిగుబడి : ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
నడిగూడెం : నీటి సౌకర్యం ఉన్న రైతులు బోర్లు, బావుల కింద వరికి బదులుగా పెసర సాగు చేసుకోవడానికి ఇది అత్యంత అనువైన సమయమని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందవచ్చని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ తెలిపారు. యాసంగి పెసర సాగుకు సంబంధించి రైతులు పాటించాల్సిన మెళకువలను ఆయన వివరించారు.
నేలలు..
తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో పెసర సాగు చేయొచ్చు. అయితే చౌడు నేలలు, మురుగు నీరు నిలిచే భూములు మాత్రం దీనికి పనికిరావు.
రబీకి అనువైన విత్తన రకాలు..
ఎంజీజీ–295, డబ్ల్యూజీజీ–37 (ఏకశిల), టీఎం–96–2, ఎంజీజీ–348 (భద్రాద్రి), ఎంజీజీ–347 (మధిర పెసర), ఎంజీజీ–351 (శ్రీరామ), డబ్ల్యూజీజీ–42 (యాదాద్రి) తదితర రకాలను సాగు చేసుకోవచ్చు. ఈ రకాల పంట కాలం 58 నుండి 75 రోజులు ఉంటుంది. ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనాలు సరిపోతాయి.
విత్తన శుద్ధి ఇలా..
కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమెథాక్సామ్ లేదా 5 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి విత్తనశుద్ధి చేస్తే 15–20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుండి రక్షించుకోవచ్చు. మొదటిసారి పొలంలో సాగు చేస్తున్నప్పుడు 200 గ్రాముల రైజోబియం కల్చర్‌ను ఎకరం విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ముందుగా శిలీంద్రనాశకంతో, ఆ తర్వాత రైజోబియంతో శుద్ధి చేయాలి.
విత్తే దూరం
సాల్ల పద్ధతిలో ఆరుతడి పంటగా విత్తుకున్నప్పుడు వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. కల్టివేటర్ లేదా గొర్రుతో మెత్తగా దున్ని చదును చేసి విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్ కల్టివేటర్ లేదా సీడ్ డ్రిల్ ద్వారా బొదె కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు.
ఎరువుల యాజమాన్యం
సేంద్రియ ఎరువులు: చివరి దుక్కిలో ఎకారానికి రెండు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు గత పంట మోళ్లను రోటోవేటర్‌తో భూమిలో కలియదున్నాలి.
రసాయన ఎరువులు : ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అనగా 18 కిలోల యూరియా 125 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ లేదా 50 కిలోల డిఏపీని వాడాలి. వరి తర్వాత మాగాణిలో విత్తుకున్నప్పుడు ఎరువులు వేయడం వీలు పడదు. అవసరం మేరకు పోషకాలను పైపాటుగా పిచికారీ చేయాలి. భూసార పరీక్షల ఆధారంగా సిఫార్సు మేరకు రసాయన ఎరువులు వేయాలి.
కీలక దశలు : పూత, కాత తయారయ్యే దశలో పంట బెట్టకు గురికాకుండా చూడాలి. బెట్ట పరిస్థితులలో 2 శాతం (20 గ్రాముల లీటరు నీటికి) యూరియా ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి.
నడిగూడెం వ్యవసాయాధికారి
గోలి మల్సూర్ సూచనలు


